తాజ్ మహల్ ఫౌంటెన్‌లో కోతుల జలకాలాటలు.. ‘వాటర్ పార్క్’గా మార్చేసిన వానరాలు వైరల్

by Ramesh Naini |

భానుడి భగభగలకు తాళలేక వానర మూకలు ఏకంగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ను తమ ‘వాటర్ పార్క్’గా మార్చేశాయి.

తాజ్ మహల్ ఫౌంటెన్‌లో కోతుల జలకాలాటలు.. ‘వాటర్ పార్క్’గా మార్చేసిన వానరాలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భానుడి భగభగలకు తాళలేక వానర మూకలు ఏకంగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ను తమ ‘వాటర్ పార్క్’గా మార్చేశాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కోతుల గుంపు తాజ్ మహల్ ఆవరణలోని ఓ ఫౌంటెన్‌లోకి దూకి ఈత కొడుతూ, కేరింతలు కొడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పర్యాటకులకు కనువిందు..

ఎండ వేడికి అల్లాడిపోతున్న కోతులు ఒక్కసారిగా నీటిలోకి ఎగిరి గంతులు వేస్తూ సరదాగా గడిపాయి. ఈ అరుదైన, సరదా దృశ్యాన్ని చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోవడమే కాకుండా, తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ‘పూల్ పార్టీ’ దృశ్యాలను చూసిన నెటిజన్లు సైతం.. ‘మనకంటే కోతులే ఎండను బాగా ఎంజాయ్ చేస్తున్నాయి, తాజ్ మహల్ ఇప్పుడు వాటికి ప్లే గ్రౌండ్ అయిపోయింది’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియోలు వైరల్ కావడంతో తాజ్ మహల్ భద్రత, వన్యప్రాణుల నిర్వహణపై కొందరు నెటిజన్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. కోతులు అంత సులభంగా లోపలికి ఎలా రాగలిగాయని ప్రశ్నించారు.

తాజ్ మహల్ ప్రధాన ఫౌంటెన్‌లో కాదు

దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. కోతులు స్నానం చేసింది తాజ్ మహల్ ప్రధాన ఫౌంటెన్‌లో కాదని, అది మసీదుకు సమీపంలో ప్రార్థనలకు ముందు భక్తులు శుద్ధి చేసుకునే ‘వజూ’(Wazu) కుండం అని తెలిపారు. ఈ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారు, ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందనే విషయాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని తాజ్ మహల్ సీనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఖలందర్ వెల్లడించారు.

Next Story