మేడారం జాతరలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-24 04:17:43  IST  )

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా పేరుగాంచిన మేడారం సమ్మక్క జాతరకు కోట్లాది మంది హాజరుకానున్నారు. ఈ మహా జాతర ఈ నెల 28న సాయంత్రం సమ్మక్క, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపైకి తీసుకురావడంతో ప్రారంభం కానుంది.

మేడారం జాతరలో పరిశుభ్రతకు ప్రాధాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా పేరుగాంచిన మేడారం సమ్మక్క జాతరకు కోట్లాది మంది హాజరుకానున్నారు. ఈ మహా జాతర ఈ నెల 28న సాయంత్రం సమ్మక్క, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపైకి తీసుకురావడంతో ప్రారంభం కానుంది. 31న సాయంత్రం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం తో జాతర పరిసమాప్తం కానుంది. మహా వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా జాతరలో గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించింది. లాస్ట్ టైం రెండు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోగా, ఈ సారి మూడు కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా వేశారు. కాగా, జాతరలో మొత్తం 42,027 మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొననున్నారు. అలాగే 1,418 ఎకరాల్లో, 42 ప్రదేశాలలో వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు.

పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత..

అయితే జాతరకు హాజరయ్యే భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడం తో పాటు మేడారం జాతర ప్రాంతం మొత్తంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానంగా ఈ జాతరకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యం, అన్ని టాయిలెట్ బ్లాక్స్ వద్ద నిరంతర నీటి సదుపాయం, అన్ని ప్రభుత్వ శాఖల వద్ద తాగునీటి సౌకర్యం, పెద్ద సంఖ్యలో టాయిలెట్ బ్లాకుల నిర్మాణం చేపట్టారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం- మిషన్ భగీరథ ఆధ్వర్యంలో దాదాపు 5500 తాత్కాలిక నల్లాలు ఏర్పాటు చేశారు. వీటిలో 517 బ్యాటరీ ఆఫ్ టాప్స్, 47 సిస్టెర్న్స్, 312 సిస్టర్న్ టాప్స్, 10 చలివేంద్రాలున్నాయి. 2024 జాతరలో 5222 నల్లాలు మాత్రమే ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 5500 నల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ జాతరకు గాను రూ. 13.70 కోట్ల వ్యయంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం- మిషన్ భగీరథ శాఖ ద్వారా 57 పనులను చేపట్టారు. గతంలో ఉన్న సదుపాయాలకు అదనంగా, ఒక అధిక సామర్థ్యం కలిగిన బోర్ వెల్, రెండు బోరెవెల్-పంప్స్, ఐదు కొత్త సిస్టర్స్, ఒక కొత్త ఓ.ఎచ్.ఎస్.ఆర్, 26 టాయిలెట్ బ్లాక్స్, ఒక క్యూ-లైన్ నిర్మాణం, మరో 9 ఇతర పనులను చేపట్టి పూర్తి చేశారు. మేడారం ప్రధాన ఆలయం పరిసరాలు, జాతీయ రహదారి, పార్కింగ్ ప్రాంతాలు, వివిధ గ్రామాల నుండి వచ్చే దారులు, చెరువుల సమీపంలో ఈ తాగునీటి సౌకర్యంతోపాటు టాయిలెట్‌లను ఏర్పాటు చేసారు.

5700 టాయిలెట్ల ఏర్పాటు..

మేడారానికి వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం మేడారం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 5700 టాయిలెట్లను తాత్కాలికంగా నిర్మించారు. మొత్తం 285 టాయిలెట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి వీటిని పరిశుభ్రంగా నిర్వహించేందుకు 255 సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

Read More..

మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు.. స్పెషల్ బస్సులను ప్రారంభించనున్న మంత్రులు

Next Story