మెక్సికోలో అంతర్యుద్ధం వాతావరణం.. 'ఎల్ మెంచో' హతంతో కార్టెల్స్ ప్రతీకార జ్వాలలు

by Malleboina Mahesh |

మెక్సికోలో డ్రగ్ లార్డ్ 'ఎల్ మెంచో' సైనిక చర్యలో హతం! కార్టెల్స్ ప్రతీకార దాడులతో జాలిస్కో అట్టుడుకుతోంది. ఎయిర్‌పోర్టులు మూసివేత, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారుల హెచ్చరిక."

మెక్సికోలో అంతర్యుద్ధం వాతావరణం.. ఎల్ మెంచో హతంతో కార్టెల్స్ ప్రతీకార జ్వాలలు
X

దిశ, వెబ్ డెస్క్: మెక్సికోలో అంతర్యుద్ధం వాతావరణం కనిపిస్తుంది. ఆదివారం.. డ్రగ్స్ ముఠాలకు (Drug gangs) చెందిన అత్యంత శక్తివంతమైన 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' (CJNG) నాయకుడు నెమెసియో ఒసెగ్యురా సెర్వంటెస్, అలియాస్ 'ఎల్ మెంచో' సైనిక చర్యలో హతమయ్యాడు. దీంతో ఆగ్రహించిన డ్రగ్స్ ముఠాలు ముఖ్యంగా కార్టెల్స్ గ్రూపులు దాడులు చేస్తూ నగరంపై విరుచుకుపడ్డారు. దీంతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ అగ్రనేత మరణ వార్త తెలియడంతో ఆగ్రహానికి గురైన కార్టెల్ సభ్యులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి దిగారు.

కార్టెల్ ముఠాలు రోడ్లపైకి వచ్చి వాహనాలను తగులబెట్టడం తో పాటు ప్రధాన రహదారులను దిగ్బంధించి భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ హింసాకాండ ఎంతలా పెరిగిందంటే, సాయుధ ముఠాలు ఏకంగా విమానాశ్రయాలను, కీలక ప్రభుత్వ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో గ్వాడలజారా వంటి ప్రధాన నగరాల్లో విమాన సర్వీసులను నిలిపివేసి ఎయిర్‌పోర్టులను మూసివేశారు. పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా మెక్సికోకు తమ సేవలను రద్దు చేసుకున్నాయి.

ప్రస్తుత పరిస్థితులు అంతర్యుద్ధాన్ని తలపిస్తుండటంతో జాలిస్కో ప్రభుత్వం 'కోడ్ రెడ్' ప్రకటించి అత్యవసర పరిస్థితిని అమలు చేస్తోంది. స్థానిక ప్రజలంతా తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, భారత్ సహా పలు దేశాలు మెక్సికోలో ఉన్న తమ ప్రజల కోసం ట్రావెల్ అడ్వైజరీలను విడుదల చేసి, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ప్రభుత్వం మరిన్ని బలగాలను రంగంలోకి దించి కార్టెల్స్ అరాచకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.

Next Story