వరుసగా వస్తున్న 1500 ట్యాంకర్లు.. ఇంధన కొరత లేదన్న సివిల్ సప్లై కమిషనర్!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-25 10:33:21  IST  )

వదంతులు నమ్మొద్దు.. పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత. 1500 ట్యాంకర్ల పంపిణీ, 20వేల కిలో లీటర్ల నిల్వలు సిద్ధం.

వరుసగా వస్తున్న 1500 ట్యాంకర్లు.. ఇంధన కొరత లేదన్న సివిల్ సప్లై కమిషనర్!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా vs ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహానగరం హైదరాబాద్ లోని పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీంతో నగరంలో ఒక్కసారిగా పానిక్ బయ్యింగ్ పెరగడంతో ఎక్కడ చూసిన భారీ మొత్తంలో వాహనాలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఇప్పటికే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి. తాజాగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మవద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Civil Supplies Commissioner Stephen Ravindra) స్పష్టం చేశారు.

వాహనదారులు అనవసరంగా ఆందోళన చెంది భారీగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ఆయన ఈ సందర్భంగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ బంకులకు 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని, రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. పానిక్ బయ్యింగ్ వల్ల అనవసరంగా బంకుల వద్ద రద్దీ పెరుగుతోందని, స్టాక్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పై భారీ ట్రాఫిక్

జంట నగరాల్లో నెలకొన్న ఇంధన సెగ ప్రభావం కేవలం నగరం లోపలే కాకుండా ప్రధాన రహదారులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పై ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బంకుల వద్ద వాహనాల క్యూలైన్లు ప్రధాన రోడ్లపైకి రావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న సందేహాల కారణంగా బంకుల వద్ద ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

భాగ్యనగరంలో పెట్రోల్ 'పానిక్'.. బకెట్లు, క్యాన్లతో బంకుల వద్ద క్యూలైన్లు!

Next Story