- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చింతలపాలెం ప్రభుత్వ పాఠశాల
చింతలపాలెం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు గ్రామస్తులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

దిశ, చింతలపాలెం : చింతలపాలెం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు గ్రామస్తులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో యువకులు, మందుబాబులు స్వేచ్ఛగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో కొందరు వ్యక్తులు పాఠశాల ప్రాంగణంలో మద్యం సేవిస్తూ హంగామా సృష్టిస్తున్నారని, అంతేకాక ప్రభుత్వ ఆస్తులైన నీటి పైపులు, తలుపులు, ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల ఆస్తులకు సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గతంలో రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ ఉండేదని, ప్రస్తుతం పర్యవేక్షణ తగ్గిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు.
పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలు కనిపిస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) శ్రీనివాస్‌ను వివరణ కోరగా, పాఠశాల వద్ద జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఆకతాయిలను తాము మందలించిన సందర్భాల్లో తమపైనే గొడవలకు దిగుతున్నారని పేర్కొన్నారు. పాఠశాల భద్రత కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎస్సై పరమేష్‌ను వివరణ కోరగా, పాఠశాల పరిసరాల్లో రాత్రి వేళల్లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణను పెంచుతామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పాఠశాల భద్రత దృష్ట్యా వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.






