పాము కాటుతో చిన్నారి మృతి

by Batti.Sumithra |

పాముకాటుతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండల పరిధిలోని కాచారం గ్రామంలో చోటుచేసుకుంది.

పాము కాటుతో చిన్నారి మృతి
X

దిశ, శంషాబాద్ : పాముకాటుతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శంషాబాద్ మండల పరిధిలోని కాచారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లా కుంబారి గ్రామానికి చెందిన చొటు పరభూయే కుటుంబ సభ్యులతో కలిసి కాచారం గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులు గది బయట నిద్రిస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి సమయంలో చొటు పరభూయే పెద్ద కుమార్తె పల్లవి (4) ఒక్కసారిగా గట్టిగా ఏడవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు.

బాలిక పక్కనే ఓ విషసర్పం కనిపించగా పరిశీలించి చూడగా ఆమె పొట్ట కింది భాగంలో పాము కాటుకు సంబంధించిన గాయం గుర్తించారు. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story