- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృగశిర కార్తె ముందస్తు సందడి..పెరిగిన చేపల ధరలు?
నల్లగొండలోని పానగల్ రోడ్డు, సూర్యాపేటలోని చేపల మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాల్లో మృగశిర కార్తె ముందస్తు సందడి నెలకొన్నది.

నల్లగొండలోని పానగల్ రోడ్డు, సూర్యాపేటలోని చేపల మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాల్లో మృగశిర కార్తె ముందస్తు సందడి నెలకొన్నది. కార్తెకు ఒక రోజు ముందుగానే చేపల మార్కెట్లు జనంతో పోటెత్తాయి. ఉదయం నుంచే కొనుగోలుదారులు రావడంతో దుకాణాలు కిటకిటలాడాయి. మృగశిర రోజున చేపలు తింటే అనారోగ్య సమస్యలు రావనేది ప్రజల నమ్మకం. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారులు రకరకాల చేపలను అందుబాటులో ఉంచారు. విక్రయాలు ఊపందుకోవడంతో చేపల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చేపల కొనుగోళ్లతో పండుగ వాతావరణం సంతరించుకుంది.
దిశ, సూర్యాపేట/నల్లగొండ క్రైం : నల్లగొండ పట్టణంలోని పానగల్ రోడ్డుతోపాటు సూర్యాపేటలోని చేపల మార్కెట్, ఖమ్మం బొమ్మ, కుడకుడ రోడ్లలోని చేపల విక్రయ కేంద్రాలలో మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం ఒకరోజు ముందుగానే సందడి నెలకొన్నది. మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంప్రదాయ విశ్వాసంతో ప్రజలు భారీ సంఖ్యలో చేపల మార్కెట్లకు తరలివచ్చి కొనుగోళ్లు చేపట్టారు. ఉదయం నుంచే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రజలు వివిధ రకాల చేపలను ఉత్సాహంగా కొనుగోలు చేయడంతో మార్కెట్ ప్రాంతాలు కిటకిటలాడాయి. తెలంగాణ సంస్కృతిలో మృగశిర కార్తె రోజున కచ్చితంగా చేపలు తింటే గుండె జబ్బులు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు రావనే నమ్మకం చాలాకాలంగా కొనసాగుతోంది.
జోరుగా విక్రయాలు...
ఈ నేపథ్యంలో చేపల వ్యాపారులు ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వినియోగదారులకు రకరకాల చేపలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతుండగా, నల్లగొండ, సూర్యాపేటలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. చేపల మార్కెట్లలో రద్దీ పెరిగి విక్రయాలు భారీగా సాగడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రజలు ఇళ్లలో వేడుకలకు సిద్ధమవుతుండడంతో చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.






