పెరిగిన భూముల ధరలు.. సామాన్యులపై రిజిస్ట్రేషన్ భారం!

by velandi.Saikiran |   (  Updated:2026-06-07 22:30:37  IST  )

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, రియల్ ఎస్టేట్ భూముల మార్కెట్ విలువలను అమాంతం పెంచేసింది.

పెరిగిన భూముల ధరలు.. సామాన్యులపై రిజిస్ట్రేషన్ భారం!
X

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, రియల్ ఎస్టేట్ భూముల మార్కెట్ విలువలను అమాంతం పెంచేసింది. పెరిగిన నూతన భూముల ధరలు జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఫీజుల శాతం మారనప్పటికీ, భూమి విలువ డబుల్ కావడంతో ఛార్జీల భారం రెట్టింపయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన హైవేలు, కమర్షియల్ ఏరియాల్లో గజం ధరలు భారీగా ఎగబాకాయి. అదనపు రిజిస్ట్రేషన్ భారం కారణంగా మధ్యతరగతి ప్రజలు స్థలాల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ ధరల పెంపు వల్ల రియల్ వ్యాపారుల కంటే సొంతింటి కలలు కనే సామాన్యుల నడ్డి విరిచినట్లయింది.

దిశ నల్లగొండ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను ఒక్కసారిగా పెంచడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ఖర్చు సామాన్యులకు మోయలేని భారంగా మారింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, భూమి ధరలు ఏకంగా డబుల్ కావడంతో చెల్లించాల్సిన ఫీజుల మొత్తం భారీగా పెరిగింది. వారం రోజుల కింద వరకు గజం భూమి మార్కెట్ విలువ రూ.10వేలు ఉండగా, అదిప్పుడు రూ.20వేలకు చేరిందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, రాజపేట, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, ఆలేరు వంటి రియల్ ఎస్టేట్ ప్రాంతాలలో ఈ ధరల పెరుగుదల సామాన్య కొనుగోలుదారుల నడ్డి విరిచేలా ఉంది. పెరిగిన నూతన ధరలు జూన్ 5 నుంచి అమలులోకి రావడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయాలపై మొదటి రెండు రోజులు తీవ్ర ప్రభావం కనిపించింది.

ఏడు భాగాలుగా ధరల పెంపు...

రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను క్రయవిక్రయాల రద్దీని బట్టి 0, 10, 15, 20, 25, 50, 75, 100 శాతాల చొప్పున మొత్తం ఏడు విభాగాలుగా పెంచారు. జాయింట్ కలెక్టర్, సీఈఓ, డివిజన్ రెవెన్యూ అధికారి, సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్, ఎంపీడీవోలతో కూడిన జిల్లా కమిటీ ఈ ధరలను ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి ఖరారు చేసింది. వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట 100శాతం వరకు పెంచగా, పట్టణాలు, నగరాల్లోని అపార్ట్‌మెంట్ల పరిధిలో మాత్రం కేవలం 10 నుంచి 20శాతం వరకే ధరలను సవరించారు.

ప్రాంతాల వారీగా కొత్త ధరలు (గజానికి)...

నల్లగొండ జిల్లా : చింతపల్లి గ్రామంలో రూ.1,600, ఎక్స్ రోడ్ పరిధిలో రూ.3,700, హైదరాబాద్-సాగర్ రోడ్‌లో రూ.4,200గా నిర్ణయించారు. చిట్యాల మార్కెట్ యార్డ్ రోడ్‌లో రూ.8,700, నల్లగొండ అద్దంకి బైపాస్‌లో రూ.16,700, ఆర్పీ రోడ్ కమర్షియల్ ఏరియాలో రూ.32,000, మైసయ్య విగ్రహం వద్ద రూ.39,600కు చేరింది.

యాదాద్రి భువనగిరి జిల్లా : బీబీనగర్ హన్మకొండ-హైదరాబాద్ బైపాస్‌లో రూ.6,200, ఎస్సీకాలనీలో రూ.3,200గా ఉంది. చౌటుప్పల్ లక్కారం జాతీయ రహదారిపై రూ.11,100, చిన్నకొండూరు రోడ్ వద్ద రూ.25,200, విజయవాడ హైవేపై రూ.31,500కి ఎగబాకింది.

సూర్యపేట, కోదాడ : కోదాడ-ఖమ్మం ఎక్స్ రోడ్ గుదిబండ వద్ద రూ.21,300 కాగా, సూర్యాపేట జనగాం రోడ్‌లో రూ.6,200, జాతీయ రహదారి వెంబడి రూ.11,700గా మార్కెట్ విలువ ఖరారైంది.

అపార్ట్‌మెంట్లలో పెరిగిన ధరలు...

సూర్యాపేట మున్సిపల్ ఆఫీస్ ఏరియా, పీఎస్ఆర్ సెంటర్లలో గజానికి రూ.2,400, న్యూ బస్టాండ్ ఏరియాలో రూ.2,800 పెంచారు. అలాగే యాదాద్రి జిల్లా పరిధిలోని హైదరాబాద్-హన్మకొండ రోడ్‌లో రూ.3,100, టాగూర్ రోడ్‌లో రూ.2,700 పెరిగింది. నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్‌లో రూ.2,200, వివేకానందనగర్‌లో రూ.1,800, వీటీ కాలనీలో రూ.2,200 చొప్పున అపార్ట్‌మెంట్ ధరలపై భారం పడింది.

ఛార్జీలు పాతవే.. భారమే అధికం...

ప్రభుత్వం ప్రస్తుతం ఎప్పటిలాగే డీఎస్‌డీ 5.5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 2.0శాతం, మ్యుటేషన్ ఛార్జీలు 1.0శాతం, కామన్ యూజర్ ఛార్జీలు రూ.500 వసూలు చేస్తోంది. మొత్తం మీద మార్కెట్ విలువపై విధించే 7.5శాతం ఛార్జీలలో ఎలాంటి మార్పు లేకపోయినా, అసలు భూమి విలువ రెట్టింపు అవ్వడంతో కొనుగోలుదారులు చెల్లించాల్సిన చార్జీల మొత్తం కూడా ఆటోమేటిక్‌గా రెండింతలైంది.

మధ్యతరగతి ప్రజల ఆవేదన...

జీవితాంతం కష్టపడి 100 గజాల సొంత ఇళ్ల స్థలం కొనుక్కోవాలనుకున్న మధ్యతరగతి ప్రజలు ఈ పెంపుతో యాభై గజాలు కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది. నల్లగొండ పట్టణంలో 150 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తికి కొత్త ధరల వల్ల గజానికి అదనంగా రూ.450 చొప్పున మొత్తం రూ.70,000 అదనపు భారం పడింది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ ఇప్పటికే ఉన్న ధరల తాకిడికి ఇబ్బంది పడుతున్న సామాన్యులను ఈ నిర్ణయం మరింత ఆర్థిక సుడిగుండంలోకి నెట్టివేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story