- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంను కూడా వదిలిపెట్టను.. సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్ ట్వీట్?
దిశ, వెబ్‌డెస్క్: క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ కుమార్ బాగోతాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ

దిశ, వెబ్‌డెస్క్: క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ కుమార్ బాగోతాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో ప్రవీణ్ కుమార్ చీకటి దందాలో రెండు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖుల పాత్రపై సర్వత్రా టెన్షన్ ఏర్పడింది. క్యాసినో వ్యవహారంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని, ప్రవీణ్ కు అధికార పార్టీ అండదండలు మెండుగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ ట్వీట్ మరింత దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ ట్వీట్ రచ్చకు దారి తీస్తోంది. ప్రవీణ్ కుమార్ చికోటీ పేరుతో ఉన్న ఓ ట్వీట్ స్క్రీన్ షార్ట్ లో ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పబడుతోంది. 'నన్ను బలిపశువును చేయాలని చూస్తే, నా చేత ఈ పనులు చేయించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను, సీఎం అయినా మంత్రులు అయినా ఇంకెవరైనా అందరికీ ఒకటే న్యాయం' అని రాసి ఉంది. ఈ ట్వీట్ ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చికోటి వెనకాల టీఆర్ఎస్ కు చెందిన పెద్ద తలకాయలు ఉన్నాయని ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది. నిజంగానే ఈ చీకటి దందా వెనుక టీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందా? ఈడీ ఉచ్చుబిగిస్తే ప్రవీణ్ అన్ని విషయాలు బహిర్గతం చేయనున్నారా? దాంతో నిజంగానే టీఆర్ఎస్ పెద్దల బాగోతం బయటపడనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ట్వీట్ నిజమే అయితే గనుక చికోటి ప్రవీణ్ వెనుక ఉన్నదెవరనేది ఉత్కంఠ రేపుతోంది.
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న క్యాసినో బాగోతాలు
మరో వైపు ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే చికోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం మూలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్ లాండ్ లో క్యాసినో నిర్వహించాడు. క్యాసినోలో భారీ మొత్తంలో చేతులు మారినట్లుగా తేల్చారు. వెయ్యి మందికి పైగా విదేశాలకు తీసుకువెళ్లి వారితో ప్రవీణ్ క్యాసినో ఆడించినట్లు సమాచారం వస్తోంది. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రవీణ్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను చేసిందంతా లీగలే అని, ఈడీ ముందే అన్ని వివరాలు చెప్పుకుంటానని ఇప్పటికే మీడియాకు వివరణ ఇచ్చారు ప్రవీణ్.
ఈడీ విచారణకు హాజరైన చికోటి
ఈ కేసులో చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్ మెంట్, నోటీస్ కాపీలతో ఈడీ ఆఫీస్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. క్యాసినోతో పాటు హవాలా లావాదేవీలపై చికోటిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇద్దరు క్యాసినో నిర్వహాకులతో సహా నలుగురు బ్రోకర్లకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. చికోటి ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు.. అందులో లభించిన కీలక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు చికోటి ప్రవీణ్ కుమార్.. తనను ఇరికించాలని చూస్తే సీఎంతో సహా ఎవరిని వదిలేది లేదని కామెంట్స్ చేశాడని చెప్పబడుతున్న ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో తాజా పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయనేది రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెట్టిస్తోంది.






