- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్ ప్రియులకు మింగుడుపడని కోడి ధరలు
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి చికెన్, కోడిగుడ్ల ధరల పెరుగుదల మరో భారంగా మారింది.

దిశ, కామారెడ్డి : నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి చికెన్, కోడిగుడ్ల ధరల పెరుగుదల మరో భారంగా మారింది. మార్కెట్‌కు వెళ్తే ప్రతి వస్తువు ధర చుక్కలు చూపుతుండటంతో చికెన్ ప్రియులు కూడా తమ అలవాట్లకు కళ్లెం వేస్తున్నారు. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు కిలోకు రూ. 40 నుంచి రూ. 50 వరకు పెరిగాయి.
స్కిన్‌తో కిలో ధర రూ. 290..
బ్రాయిలర్ చికెన్ ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రస్తుతం స్కిన్‌తో కూడిన చికెన్ కిలో రూ. 290కు విక్రయిస్తున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి చికెన్ తినే అలవాటున్న మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరగడంతో బిర్యానీ, చికెన్ కర్రీ ఆర్డర్లు సగానికి తగ్గిపోయాయని హోటల్ యజమానులు చెబుతున్నారు.
స్కిన్‌లెస్ అయితే కిలో రూ. 320..
శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం విక్రయించే స్కిన్‌లెస్ చికెన్ ధర మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ. 320కు విక్రయిస్తున్నారు. బోన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ. 380 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో చికెన్ వంటకాలకు డిమాండ్ ఉన్నప్పటికీ, పెరిగిన ధరల కారణంగా నిర్వాహకులు మెనూలో కోత విధిస్తున్నారు.
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్ల ధరలు..
కోడిగుడ్ల ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డు రూ. 7.50కు, రిటైల్‌లో రూ. 8కు విక్రయిస్తున్నారు. పది గుడ్ల ధర రూ. 80 దాటింది. వేసవి తీవ్రత కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు ఫీడ్ ధరలు పెరగడం వల్ల గుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. బడ్జెట్ హోటళ్లలో గుడ్డు కర్రీ ధరను కూడా రూ. 5 నుంచి రూ. 10 వరకు పెంచారు.
హోటళ్లు, మెస్‌లలో భోజన ధరలు పెంపు..
ముడి సరుకుల ధరలతో పాటు చికెన్ ధరలు పెరగడంతో హోటళ్లు, మెస్‌లలో భోజన ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికెన్ బిర్యానీ ప్లేట్‌పై రూ. 20, చికెన్ కర్రీ మీల్‌పై రూ. 15 వరకు ధరలు పెంచారు. దీంతో కూలీలు, కార్మిక వర్గాలు బయట భోజనం చేయడాన్ని తగ్గించుకున్నాయి. "రోజుకు రూ. 200 సంపాదించేది ఇప్పుడు చికెన్ మీల్‌కే సరిపోతోంది" అని ఓ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
వినియోగం తగ్గడంతో వ్యాపారుల ఆందోళన..
ధరలు పెరగడంతో గతంతో పోలిస్తే చికెన్ అమ్మకాలు సుమారు 30 శాతం వరకు తగ్గాయని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. ఫీడ్, మందులు, రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు తగ్గించడం సాధ్యం కావడం లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అంటున్నారు. మరో నెల రోజుల పాటు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






