చెస్ లో చరిత్ర సృష్టించిన వైశాలి

by Muthe.Rajitha |

అంతర్జాతీయ చెస్ వేదికపై గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. వైశాలి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు.

చెస్ లో చరిత్ర సృష్టించిన వైశాలి
X

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రీడా చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం నమోదైంది. అంతర్జాతీయ చెస్ వేదికపై గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. వైశాలి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. సైప్రస్‌ వేదికగా జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'FIDE ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026'లో వైశాలి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 14 రౌండ్ల పాటు జరిగిన ఈ కఠినమైన టోర్నమెంట్‌లో మొత్తం 8.5 పాయింట్లను సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, టోర్నమెంట్ విజేతగా నిలిచారు. ఈ విజయంతో ఆమె 2026 'ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్' ఫైనల్స్ కోసం ఛాలెంజర్‌గా అర్హత సాధించారు. అందులో వైశాలి ప్రపంచ మహిళల చెస్ టోర్నీ టైటిల్ కోసం చైనాకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జూ వెన్జున్ (Ju Wenjun)తో తలపడనున్నారు.

చెస్ చరిత్రలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వంటి దిగ్గజ క్రీడాకారిణులు ఎంతో అద్భుతమైన ప్రతిభను కనబరిచి దేశానికి ఎన్నో పతకాలు అందించారు. కానీ, క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను నేరుగా గెలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి చేరుకున్న మొదటి భారతీయ మహిళగా వైశాలి రికార్డు సృష్టించడం అత్యంత విశేషం. ఇది భారత మహిళా చెస్ క్రీడాకారిణులకు ఒక గొప్ప మైలురాయి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రీడాకారిణుల ఆధిపత్యాన్ని చాటిచెప్పే సందర్భం. గతంలో 2023 మరియు 2025లలో వరుసగా రెండుసార్లు FIDE ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టైటిల్స్‌ను గెలుచుకోవడం ద్వారా తన సత్తాను నిరూపించుకున్న వైశాలి.

2001, జూన్ 21న చెన్నైలో జన్మించిన వైశాలి, తన సోదరుడు, స్టార్ చెస్ ప్లేయర్ ఆర్‌. ప్రజ్ఞానందతో కలిసి చెస్ ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రపంచంలోనే 'గ్రాండ్‌మాస్టర్' హోదా పొందిన తొలి సోదరి-సోదరుల జోడిగా వీరు గుర్తింపు పొందడం విశేషం. 2024లో వైశాలి గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకున్నారు. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత భారతదేశం నుండి ఈ అరుదైన హోదా అందుకున్న మూడవ మహిళా క్రీడాకారిణిగా ఆమె ఇప్పటికే చరిత్ర సృష్టించారు.

అంతేకాకుండా, 2024లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టుకు స్వర్ణ పతకం అందించడంలో ఆమె పోషించిన పాత్ర చిరస్మరణీయం. జూ వెన్జున్‌తో జరగబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో వైశాలి విజయం సాధిస్తే, అది భారత మహిళల క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం అవుతుంది. వైశాలి సాధించిన ఈ ఘనతపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తదుపరి టైటిల్ గెలవాలని యావత్ భారతదేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Next Story