అంతరించిన చిరుతలు మళ్లీ వస్తున్నాయ్!

by Disha Web Desk 7 |
అంతరించిన చిరుతలు మళ్లీ వస్తున్నాయ్!
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మళ్లీ మన అడవుల్లో పెంచనున్నారు. ఖండాంతరాల నుంచి చిరుతలను మనదేశానికి తరలించడం ఇదే తొలిసారి కాగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాల్లో చిరుతలను అనేక జాతీయ పార్కులు, రిజర్వ్‌లకు తిరిగి తీసుకురావాలని భారతదేశం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ప్రపంచంలోని చిరుతల జనాభాలో మూడింట ఒక వంతుకు పైగా దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడి నుంచి 16 చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌‌కు తీసుకువస్తుండగా.. వీటిని పట్టుకునేందుకు హెలికాప్టర్ల ద్వారా ట్రాంక్విలైజర్లను ప్రయోగించారు. ఆ తర్వాత వాటిని ట్రాక్ చేసేందుకు శరీరాల్లో మైక్రోచిప్ అమర్చి, అవసరమైన వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా రేబిస్, హెర్పెస్‌, బ్లడ్ పారాసైట్స్ సహా పలు టీకాలు, యాంటీబయాటిక్స్ అందించిన వైద్యులు.. డీ హైడ్రేషన్‌ కాకుండా ఐవీలను ఎక్కించారు. డీఎన్‌ఏ విశ్లేషణ కోసం రక్తనమూనాలను సేకరించి వాటిని ఆయా దేశాల్లోని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

జోహన్నెస్‌బర్గ్ నుంచి ఢిల్లీ వరకు కార్గో విమానంలో చిరుతలను రవాణా చేస్తుండగా.. సాధారణంగా బోనుల్లో బంధించినప్పుడు అవి ఒత్తిడికి గురవుతాయి, అందువల్ల ప్రయాణ సమయంలో ప్రశాంతంగా ఉంచేందుకు తేలికపాటి మత్తుమందును అందిస్తారు. అంతేకాదు అడవిలో స్వేచ్ఛగా సంచరించే సమయంలో ఉక్కిరిబిక్కిరి కాకుండా, అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రయాణానికి ముందు రెండు రోజుల పాటు పస్తులుంచుతారు. ఇండియా తీసుకొచ్చాక కూడా నెల రోజుల పాటు కూనో నేషనల్ పార్క్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతారు. సాధారణంగా ఇలాంటి పెద్ద జంతువులు తాము వచ్చిన ప్రాంతానికి వెళ్లిపోవటానవికి ప్రయత్నిస్తుంటాయి. అందుకని వీటిని ఒకటి రెండు నెలల పాటు కంచెలు ఉన్న ప్రాంతాల్లో ఉంచుతారు, ఆ తర్వాత వీటిని 11,500 హెక్టార్ల సువిశాల జాతీయ పార్కులో స్వేచ్ఛగా వదిలేస్తారు.

భారతదేశంలో చిరుత ఆవాసాలు తగ్గిపోతున్నందున ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. చిరుతల జనాభా అంతరించిపోవడానికి నివాసనష్టం ప్రధాన కారణం కాగా కునో జాతీయ పార్క్ చిరుతలకు తగినంత స్థలంతో పాటు సరిపడా ఆహారం కూడా అందించగలదని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. రాబోయే ఐదు నుంచి ఆరేళ్లలో మరో 50 నుంచి 60 చిరుతలను దిగుమతి చేసుకోవాలని.. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని పార్కులు, రిజర్వ్‌లలో తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తోంది కేంద్రం.


Next Story