- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ వార్నింగ్ ఇచ్చినా.. పరీక్షల్లో నకలు
నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పరాకాష్టకు చేరింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఖర్చుకు వెనకాడకుండా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి చదివించే వారు.. విద్యా పరంగా తమ పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, వారు ఉన్నతంగా ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు ఆలోచించే వారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రూ.లక్షల్లో ఫీజులు చెల్లించి మరీఅడ్మిషన్ ఇప్పించి తమ పిల్లలను చదివించేవారు. ఆర్థిక స్థోమతతో పాటు అవకాశాలు కూడా లేకపోవడం కారణంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పల్లెటూళ్లలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే వారు. కానీ, కాలంతో పాటు ప్రజల ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి. అవకాశాలూ పెరిగాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అవకాశాలు ముంగిట్లోకే వచ్చేశాయి. ప్రైవేటు విద్యాసంస్థల సంఖ్య అంతటా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.
ప్రైవేటు విద్యాసంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఉత్తమ ఫలితాల కోసం వెళ్లాల్సిన దారిలో వెళ్లకుండా ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డదారిలో వెళుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా.. ప్రైవేటు స్కూళ్లను చూసి ప్రభుత్వ స్కూళ్లు కూడా తామెక్కడ వెనకబడి పోతామోననే భయంతో అడ్డదారిని ఆశ్రయిస్తున్నాయి. కృషిని నమ్ముకోవాల్సిన విద్యార్థులు పరీక్షల్లో జరిగే కాపీని,మాస్ కాపీయింగ్ ను నమ్ముకునేలా పరిస్థితిని మార్చేశారు. ఏడాదంతా చదివినా చదవకపోయినా, రూ. లక్షల్లో ఫీజులు ముక్కు పిండి మరీ వసూలు చేసే విద్యాసంస్థలు పరీక్షలు రాగానే ఉత్తమ ఫలితాల కోసం అడ్డదారులు తొక్కేస్తున్నాయి. వారి వంకర బుద్ధికి ప్రభుత్వ ఉద్యోగులే సహకరిస్తూ అక్రమాలను, పరీక్షల్లో అవకతవకలను ప్రోత్సహిస్తున్నారు. వార్షిక పరీక్షలంటే నలుగురిలో నవ్వుల పాలయ్యేలా చేస్తున్నారు.
జిల్లాలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పరాకాష్టకు చేరి ప్రశ్నాపత్రం నేరుగా ఎగ్జామ్ హాలునుండే బయటకొచ్చిన ఘటన ఈనెల 18 న చోటు చేసుకుంది. ఆర్మూర్ డివిజన్ లోని ఆలూరు జిల్లాపరిషత్ హైస్కూల్ లోని టెంత్ ఎగ్జామినేషన్ సెంటర్ నుండి తెలుగు పరీక్ష పేపర్ వాట్సప్ ద్వారా బయటికి లీకైంది. అదే రోజు మెండోర జడ్పీహెచ్ఎస్ స్కూల్ తో పాటు బోధన్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సెంటర్ లో కూడా పేపర్ లీకైందన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి తొమ్మిది మంది ఉద్యోగులపై వేటు వేసారు. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తరువాత బోధన్ సెంటర్ లో
అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదనే కారణంగా చీఫ్ I సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లపై సస్పెన్షన్ ను ను ఎత్తివేశారు. సస్పెన్షన్ కు గురైన వారి విషయంలో ఎవరూ తన వద్దకు రావొద్దని సీరియస్ గా ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ కరాఖండీగా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ తో సరిపెట్టేది లేదని, ఇంకా కఠిన చర్యలుంటాయని ఈనెల 23 న కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు..
ఇంత జరిగినా మాస్ కాపీయింగ్ ఆగదే..?!
ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా, స్ట్రాంగ్ వార్నింగులిచ్చినా తమ పంథా తమదేనని, తమ వెనక ఉద్యోగ సంఘాల నాయకులున్నారని, ప్రజాప్రతినిధులున్నారనే ధైర్యంతో కలెక్టర్ ఆదేశాలను కూడా తుంగలో తొక్కేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు పాటిస్తున్నట్లు నటిస్తూనే పరీక్షా కేంద్రాల్లో గుట్టు చప్పుడు కాకుండా కాపీయింగ్ నడిపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుండి రూ. 5 వేల నుండి రూ.10 వేల వరకు పరీక్షలకు ముందుగానే వసూలు చేసిన ఇన్విజిలేటర్లు వారి కోసం కాపీయింగ్ ను రహస్యంగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలూరు ఘటన తరువాత ఒక రోజు పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు స్ట్రిక్ట్ గా వ్యవహరించినప్పటికీ తరువాత షరా మామూలైపోయిందని విద్యార్థులే స్వయంగా పేరెంట్స్ కు చెపుతున్నట్లు సమాచారం.
డీఈఓ, ఎంఈఓలు ఏం చేస్తున్నట్లు..?
పరీక్షలంటే చూచిరాత లా కాకుండా ఏడాది పొడవునా చదివి ఒంటబట్టించుకున్న జ్ఞానాన్ని పేపర్ పై సొంతంగా ప్రజెంట్ చేయాల్సిన స్టూడెంట్స్ కాపీ చేస్తూ పరీక్షలు రాస్తున్నారు. వీరికి ప్రభుత్వ టీచర్లు, హెడ్మాస్టర్లు దగ్గరుండి సహకరిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఇంత దారుణాలు జరుగుతున్నా అడ్డుకుని శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యాధికారి సహా మండల విద్యాధికారులు ఏం చేస్తున్నట్లు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో జరిగే అవకతవకలు. మాస్ కాపీయింగ్ ప్రతియేటా ఉండేదేనని, ఇదేం కొత్తగా లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాల కోసం స్కూళ్లతో కుమ్మక్కై నట్లు తెలుస్తోంది. మీకు మేము.. మాకు మీరు.. పరస్పరం సహకరించుకోవాలనే రహస్య ఒప్పందంతోనే పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోందనే అభిప్రాయాలున్నాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి కొత్తగా జిల్లాకు రావడం, ఆమె హయాంలో మొదటి సారి జరిగిన పరీక్షల్లో పేపర్ లీకేజీ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం మాత్రమే కొత్తగా జరిగిందని, మిగతాదంతా సేమ్ టూ షేమ్.. అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ ప్రక్షాళన చేయాల్సింది ముందుగా విద్యాశాఖనే..
పరీక్షలు పరీక్షల మాదిరిగా జరగాలన్నా, ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నా కలెక్టర్ చేయాల్సింది ముందుగా జిల్లా విద్యాశాఖ నుండే ప్రక్షాళన ప్రారంభించాలని, గుట్టు చప్పుడు కాకుండా పని దొంగలంతా జిల్లా విద్యాశాఖలోనే ఉన్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులే చెపుతున్నారు. డిప్యూటేషన్ల పేరుతో విధులను తప్పించుకోవడానికి డిప్యూటేషన్ల పేరుతో అడ్డగోలుగా చెలాయించుకుంటున్నా జిల్లా విద్యాధికారి సమీక్షించి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏళ్లుగా పాతుకుపోయిందెవరో.. డిప్యూటేషన్లలో ఉన్నవారెవరో గుర్తించాలి..
జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయి అధికారం చెలాయిస్తున్న వారు ప్రైవేట్ నుంచి నెలవారీ మామూళ్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వారే అవకతవకలు, అక్రమాలకు అసలు బీజం వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది స్కూల్ హెడ్మాస్టర్లు, టీచర్లు, విద్యాశాఖ ఉద్యోగులు అవసరం లేకున్నా ఫైరవీల ద్వారా డిప్యూటేషన్లు వేయించుకుని విధులకు డుమ్మా కొడుతున్నా జిల్లా విద్యాధికారి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విద్యాశాఖలో అంతర్గతంగా పెద్ద చర్చే జరుగుతోంది. దీనిపై కలెక్టర్ జిల్లా విద్యాధికారిని వివరణ కోసం విచారణ చేపడితే అన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. విద్యాశాఖలో జరిగే అవకవతవకలకు కాస్తయితా అడ్డుకట్ట పడి ఆ శాఖ పనితీరు మెరుగయ్యే అవకాశాలున్నాయనేది విద్యాశాఖ ఉద్యోగుల వాదన.






