- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్ఎండీఏ జేఎంసీగా చంద్రకళ
జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న కె.చంద్రకళకు హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న కె.చంద్రకళకు హెచ్ఎండీఏ(కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రోరైలు) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ జేఎంసీగా పనిచేస్తున్న వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే చంద్రకళ గతంలో విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షించడంతోపాటు భూసేకరణలో కీలకపాత్ర పోషించిన అనుభవం ఉంది. అందులో భాగంగానే హెచ్ఎండీఏకు సంబంధించిన ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు పరిష్కరించడానికి పోస్టింగ్ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ చేపడుతున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు పాతబస్తీలో మెట్రోరైలు ప్రాజెక్టుకు భూసేకరణ కీలకంగా మారింది. ఈ తరుణంలో చంద్రకళకు పోస్టింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
విలువైన భూముల పరిరక్షణ…
-బంజారాహిల్స్ లో వందలాది ఎకరాలను కాపాడిన పేరు ఆమెకు ఉన్నది. ప్రధానంగా సర్వే నం.403లోని పలు ల్యాండ్ పార్శిళ్లపై రాజకీయ నేతల కన్ను పడింది. జీవో 166, జీవో 59 ల కింద రెగ్యులరైజ్ చేయాలంటూ ఎంత ఒత్తిడికి గురి చేసినా రిజెక్ట్ చేశారు. ఇందులో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారిని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
–రాయదుర్గం సర్వే నం.46లో 84.30 ఎకరాలను కాపాడడంలో కీలక పాత్ర వహించారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేలా పోరాటం చేశారు. దీంట్లోనూ అనేక రాజకీయ శక్తులు ఆమెను ఇబ్బందులకు గురి చేశారు.
– రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీర్ గ్రామంలో సర్వే నం.59, 65, 71, 102, 185 నుంచి 229, 231 నుంచి 237, 240, 241, 243, 244, 247 నుంచి 252, 254, 256 నుంచి 260, 262 నుంచి 266 వరకు ఉన్న 1653.32 ఎకరాలపై నెలకొన్న సుదీర్ఘకాల వివాదానికి తెరదించిన కేసులోనూ చంద్రకళ ఉన్నారు. అది వక్ఫ్కాదని, అలాగే ప్రైవేటు వ్యక్తులదీ కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. రూ.50 వేల కోట్ల విలువైన స్థలం ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఆ సమయంలో రాజేంద్రనగర్ ఆర్డీవోగా చంద్రకళ తీవ్రంగా కృషి చేశారు.
– నగరం నడిబొడ్డున భోజగుట్టలో వందల కోట్ల విలువైన భూమిని, బంజరాహిల్స్‌లో వేల కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో హస్తగతం చేసుకునేందుకు యత్నించిన ఆంధ్రా ఎమ్మెల్సీని సైతం వదల్లేదు.
– 90 ఎకరాల ఎవాక్యూ ప్రాపర్టీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఫోర్జరీ దస్తావేజులను పసిగట్టి మ్యుటేషన్‌ను నిలిపివేశారు.
– శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలో సర్వే నెం.77లో 127.31 ఎకరాల గైరాన్ సర్కారీ, సర్వే నెం.78లో 215.27 ఎకరాల కంచ సర్కారీ, సర్వే నెం.79లో 39.08 ఎకరాల కంచ సర్కారీ, సర్వే నెం.80లో 484.31 ఎకరాల కంచ సర్కారీ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. ఇనాం భూములపై హైకోర్టులో సీఎస్ నెం.7/1958, సీఎస్ నెం.14/1958 ప్రకారం ప్రిలిమినరీ డిక్రీ పొందామంటూ క్రయ విక్రయాలు జరిపారు. ఐతే ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌గా సాగిన కేసులో ప్రభుత్వాన్ని పార్టీగా చేయకుండా పొందిన ప్రిలిమినరీ డిక్రీ ఆధారం కాదు. అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమిగా గుర్తించారు. రూ.వేల కోట్లకు పైగా విలువజేసే 867 ఎకరాలను కాపాడడంలోనూ చంద్రకళ పాత్ర ఉంది.
– గండిపేట మండలం పుప్పాలగూడలో రూ.వేల కోట్ల విలువైన 200 ఎకరాలకుపైగా ఉన్న ఎవాక్యూ ప్రాపర్టీపై ప్రభుత్వం విజయం సాధించడంలో కృషి చేశారు.
– రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖకు ( గ్రేహౌండ్స్) కేటాయించిన భూములపై ప్రైవేటు వ్యక్తులకు, జీపీఏ హోల్డర్లకు హక్కుల్లేవని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న 142.39 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పింది. 2003 జూన్ మూడో తేదీన మంచిరేవులలో సర్వే నం.393 లోని 183.29 ఎకరాలను గ్రే హౌండ్స్ కు పంచనామా చేసి అప్పగించారు. అంతకు ముందు 1989లోనే 183 ఎకరాలను కేటాయించారు. అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్నది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి అత్యంత విలువైన భూమిని హస్తగతం చేసుకునేందుకు ఆంధ్రా నాయకులు, కంపెనీలు చేసిన కుట్రలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. ఈ అంశంలో చంద్రకళ కృషి ఎనలేనిది. పలుమార్లు సుప్రీం కోర్టు దాకా వెళ్లి కేసు గెలిచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.
– షేక్ పేట తహశీల్దార్ గా, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ ఆర్డీవోగా ప్రభుత్వ భూముల సంరక్షణలో ఆమెది కీలక పాత్ర పోషించింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆమెను మొదట శంషాబాద్ జోనల్ కమిషనర్ గా నియమించారు. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ కోసం అత్యంత కీలక బాధ్యతలు అప్పగించారని చర్చ జరుగుతుంది.






