కూకట్‌పల్లిలో SIR ప్రక్రియను పరిశీలించిన సీఈవో

by Jakkula.Mamatha |

ప్రత్యేక సమగ్ర సవరణ "సర్" ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.

కూకట్‌పల్లిలో SIR ప్రక్రియను పరిశీలించిన సీఈవో
X

దిశ,మేడ్చల్ బ్యూరో: ప్రత్యేక సమగ్ర సవరణ "సర్" ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పూరించడంలో ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను శనివారం సుదర్శన్ రెడ్డి పర్యవేక్షించారు. కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలాజీ నగర్ వార్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న "సర్" ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఫారాల పంపిణీ కార్యక్రమం సజావుగా జరుగుచున్నదా..? ఓటర్లు నింపిన ఫారాలను తిరిగి తీసుకుంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు.

ఫారాల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫారాలను ఏ విధంగా డిజిటలైజ్ చేస్తున్నారని, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆపరేటర్లతో జాగ్రత్తగా చేయించాలన్నారు. బీఎల్‌వోలు ఓటర్ల నుంచి తీసుకున్న ఫారాలను వెంటవెంటనే డిజిటలైజేషన్ చేయించాలని ఆదేశించారు. అదే ప్రాంతంలోని అపార్ట్మెంట్‌లలో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఫారాల అప్లోడింగ్, పూరించిన ఫారాలను తీసుకునే ప్రక్రియను సీఈవో పర్యవేక్షించారు. ఓటర్ల ఫారాలు పూరించడంలో వారికి అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలను అందించాలని తెలిపారు. అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ల ద్వారా వివరాలు సేకరించి వారికి ఫారాలను అందించాలని ఆదేశించారు. బి ఎల్ వో లకు కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటులో లేని వారి వివరాలు సూపర్వైజర్లకు తెలియజేయాలని సూచించారు.

2002లో లేని వారి ఫారాలు ఏ విధంగా పూరించాలి అనే అంశంపై సీఈవో వివరించారు. అనంతరం కెపిహెచ్బి 6 ఫేస్‌లోని అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న "సర్" ప్రక్రియలో భాగంగా ఓటర్లతో సీఈవో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఇండో ఫార్చూన్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ పరిశీలించి బిఎల్ఓ ల పనితీరును పర్యవేక్షించి అక్కడ ఉన్న ఓటర్లు అడిగిన సందేహాలకు సీఈవో సమాధానం ఇచ్చారు. ఈ పర్యటనలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ అశోక్, డీసీ ఆంజనేయులు సూపర్వైజర్లు, బీఎల్వోలకు తదితరులు పాల్గొన్నారు.

Next Story