- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత నావికుల మృతిపై కేంద్రం మెతక వైఖరి: పవన్ ఖేరా
యూఎస్ నేవీ దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తప్పుపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: గల్ఫ్ ప్రాంతంలో యూఎస్ నేవీ జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘోర ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్ ద్వారా మాట్లాడిన తీరు అత్యంత బలహీనంగా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మండిపడ్డారు. అమెరికా దాడులు 'సమర్థనీయం కావు' అంటూ జైశంకర్ ట్విట్టర్‌లో చాలా సున్నితమైన పదజాలం వాడారని, మన దేశ పౌరులను పొట్టనబెట్టుకున్న దేశాన్ని నిలదీయడానికి ఇదా పద్ధతి అని ఆయన దుయ్యబట్టారు. దీనికి భిన్నంగా అమెరికా మంత్రి రూబియో ప్రకటన మాత్రం భారతదేశాన్ని హెచ్చరించేలా అత్యంత కఠినంగా ఉందని ఖేరా గుర్తుచేశారు.
రెండు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పుడు, వాటితో సంబంధం లేని మూడో దేశపు వాణిజ్య నౌకలపై దాడులు చేయకూడదని అంతర్జాతీయ చట్టాలు స్పష్టం చేస్తున్నాయని పవన్ ఖేరా పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకాయానాన్ని నియంత్రించే 'సాన్ రెమో మాన్యువల్', 1949 నాటి 'జెనీవా కన్వెన్షన్' నియమాలను అమెరికా సైన్యం బాహాటంగా ఉల్లంఘించిందని ఆయన వివరించారు. ఇంత పెద్ద తప్పు చేసిన అమెరికాను భారత్ గట్టిగా నిలదీసి, అధికారికంగా క్షమాపణ కోరాల్సి ఉండగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ ఎందుకు అంతలా తలవంచారని పవన్ ఖేరా ప్రశ్నించారు. కేంద్రం అనుసరిస్తున్న ఇటువంటి మెతక వైఖరి వల్ల అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్ట దిగజారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.






