కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాక్సెస్ కంట్రోల్ రహదారిగా NH-44

by Kema Shiva Kumar |

హైదరాబాద్- బెంగళూరు హైవేపై ఇక వాహనాలు రయ్.. రయ్ అంటూ పరుగులు తీయనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాక్సెస్ కంట్రోల్ రహదారిగా NH-44
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్- బెంగళూరు హైవేపై ఇక వాహనాలు రయ్.. రయ్ అంటూ పరుగులు తీయనున్నాయి. ఐటీ నగరి బెంగళూరుకు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ఈ మార్గం వేగవంతం, సురక్షితం, సౌకర్యవంతం మాత్రమే కాకుండా పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య వారధిగా మారనుంది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు, అనంతపురం మీదుగా బెంగళూరు వరకు సాగే జాతీయ రహ దారి(ఎన్.హెచ్-44)ని యాక్సెస్‌ కంట్రోల్‌ హైవేగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరు లేన్ల రహదారిగా, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఈ మార్గాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. ముందు పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని భావించినా... చివరకు యాక్సెస్ కంట్రోల్ వైపే మొగ్గుచూపారు. ప్రస్తుతం ఈ మార్గంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవడానికి సగటున 7 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. యా క్సెస్‌ కంట్రోల్‌ విధానం అమల్లోకి వస్తే కేవలం ఐదు గంట ల్లోనే ఈ ప్రయాణాన్ని పూర్తిచేయొచ్చని అంచనా వేస్తున్నా రు. ఈ రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ(మోర్త్‌) నిర్ణయం తీసుకుంది.

హైవే విస్తరణ..

హైదరాబాద్‌-బెంగళూరు హైవే-44ను విస్తరించకుండా... దానికి సమాంతరంగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ హై స్పీడ్‌ కారిడార్‌ నిర్మించాలని భావించారు. ఈ మేరకు మూడు ఎలైన్‌మెంట్లతో అధ్యయనం కూడా చేయించారు. గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రస్తుత ఎన్‌హెచ్‌-44 నుంచి 10-15 కి.మీ. దూరంలోనే సమాంతరంగా వెళ్తున్నది. ఎన్‌హెచ్‌- 44 ప్రస్తుతం 576 కి.మీ. ఉండగా, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ సైతం దాదాపు అంతే దూరం వస్తోంది. ఎన్‌హెచ్‌-44 నుంచి 30-40 కి.మీ. దూరంగా గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను తీసుకెళ్లాలని భావిస్తే దాని పొడవు, ఎన్‌హెచ్‌-44 కంటే మరింత ఎక్కువవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను కొత్తగా నిర్మించే బదులుగా ప్రస్తుత హైవేనే ఆరు లేన్లుగా విస్తరించి, దాన్ని యాక్సెస్‌ కంట్రోల్‌ చేయడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను ఐదు నెలల్లో సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

పారిశ్రామిక అభివృద్ధి పరుగులు

బెంగళూరు హైవేలో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిలో కీలకంగా మారనుంది. రాష్ట్రంలో శంషాబాద్- పోలేపల్లి, ఏపీలో కర్నూలు- ఓర్వకల్ మెగా ఇండస్ట్రీయల్ హబ్, కర్ణాటకలో చిక్ బళ్లాపూర్, తుమకూరు హబ్ లు పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నాయి. వేగవంతమైన ప్రయాణం ద్వారా పరిశ్రమలు, గోదాంలు, లాజిస్టిక్స్‌ హబ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. సరుకు రవాణా సమయం, ఖర్చు తగ్గడంతో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. యాక్సెస్‌ కంట్రోల్‌ విధానంతో హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో ట్రాఫిక్‌ జామ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.-

ఆధునిక ప్రమాణాలతో ప్రమాదాలకు చెక్

ఎన్ హెచ్-44 మూడు రాష్ట్రాల పరిధిలో ఉంది. తెలంగాణలో 210 కి.మీ, ఏపీలో 260 కి.మీ, కర్ణాటకలో 106 కి.మీ. కలిపి మొత్తం 576 కి.మీ. ఉంది. దీన్ని ఆరు వరు సల యాక్సెస్ కంట్రోల్ గా మారిస్తే వాహనాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వెళ్తాయి. అలాగే పరిమితంగా కొన్నిచోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు (ఎంట్రీ), బయటకు వచ్చేందుకు (ఎగ్జిట్) అవకాశం కల్పిస్తారు. ఇరువైపులా రెండే సి వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. హైవేకు ఆనుకుని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందినవారు సర్వీసు రోడ్లపైనే రాకపోకలు సాగించొచ్చు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు వంటివి సర్వీస్ రోడ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. హైవేను గంటకు 120 కి.మీ.వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నారు.

Next Story