మీడియా అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం

by Malleboina Mahesh |

న్యూఢిల్లీలో 350 మందికి పైగా మీడియా, కమ్యూనికేషన్ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఒక రోజు సదస్సు నిర్వహించింది.

మీడియా అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో మీడియా, కమ్యూనికేషన్ అధికారుల కోసం ఒక రోజు ప్రత్యేక సదస్సును నిర్వహించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (Phase-III) ప్రక్రియ నడుస్తున్న 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మీడియా నోడల్ అధికారులు (MNOs), సోషల్ media నోడల్ అధికారులు (SMNOs), జిల్లా పీఆర్వోలు (PROs) సహా 350 మందికి పైగా అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) శ్రీ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో దేశ స్వాతంత్ర్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ప్రజా భాగస్వామ్యం, రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైందని హర్షం వ్యక్తం చేశారు. అధికారులు అందించే సమాచారం సకాలంలో, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా, వాస్తవాలు, చట్టాల పరిధికి లోబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి కూడా ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, సమాచార మార్పిడి అనేది కేవలం ఇన్‌పుట్‌గా కాకుండా సమాజంపై సానుకూల ప్రభావం (Impact) చూపేలా ఉండాలని, ఈసీఐ మార్గదర్శకాలను ప్రజల్లోకి సరళంగా తీసుకెళ్లడంలో అధికారులదే కీలక పాత్రని పేర్కొన్నారు.

ఈ ఒక రోజు సదస్సులో ఎన్నికల ప్రక్రియ అంతటా అనుసరించాల్సిన మీడియా వ్యూహాలతో పాటు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు (Misinformation), ఫేక్ నరేటివ్స్‌ను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో ప్రాక్టికల్ సెషన్స్ ద్వారా వివరించారు. యువ ఓటర్లను ఆకర్షించడం, పారదర్శక సమాచార మార్పిడిపై ప్రత్యేకంగా చర్చించిన ఈ సదస్సు, ఇటీవల ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల అధికారులు తమ ఉత్తమ విధానాలను (Best Practices) పంచుకోవడంతో పాటు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో సాగిన ప్రత్యేక ప్రశ్నోత్తరాల సమయం (Q&A Session) తో ముగిసింది.

Next Story