వెయిట్ లాస్ డ్రగ్స్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.. కేవలం ఆ ముగ్గురు డాక్టర్లే రాసివ్వాలి!

by Malleboina Mahesh |

వెయిట్ లాస్ డ్రగ్స్ (GLP-1)పై కేంద్రం నిఘా! కేవలం స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తోనే విక్రయించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు.

వెయిట్ లాస్ డ్రగ్స్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.. కేవలం ఆ ముగ్గురు డాక్టర్లే రాసివ్వాలి!
X

దిశ, వెబ్ డెస్క్: మారుతున్న జీవన శైలితో నేటి సమాజంలో ప్రజలు బరువు పెరుగుదల సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు వేగంగా బరువు తగ్గేందుకు వెయిట్ లాస్ డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బరువు తగ్గడానికి, టైప్-2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే GLP-1 (Glucagon-Like Peptide-1) ఔషధాల వినియోగంపై భారత ప్రభుత్వం (PIB) కీలక నిర్ణయం తీసుకుంది. వీటి వాడకంపై సమగ్రమైన హెచ్చరికలు, నియంత్రణ ఉత్తర్వులను జారీ చేసింది. సోషల్ మీడియా ట్రెండ్స్ కారణంగా ఈ మందులకు విపరీతమైన డిమాండ్ పెరగడం, తద్వారా అనధికార విక్రయాలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

కీలక మార్గదర్శకాలు జారీ

ఇవి సాధారణ మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేసే (Over-the-counter) మందులు కావు. వీటిని కేవలం ఎండోక్రినాలజిస్ట్ (Endocrinologists), ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులు (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో) మాత్రమే రాసివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడితే ప్యాంక్రియాటైటిస్, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇప్పటికే దేశవ్యాప్తంగా 49 ఆన్‌లైన్ ఫార్మసీలు, వెల్‌నెస్ క్లినిక్‌లు, హోల్‌సేలర్లపై దాడులు నిర్వహించింది. తప్పుడు ప్రకటనలు (Surrogate Ads) ఇచ్చే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తాజా నిబంధనలు ఉల్లంఘించి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే ఫార్మసీల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Next Story