సెలెబ్రిటీ కల్చర్ పై మోజు.. 15 నిముషాలకు రూ.30 కోట్లు

by Muthe.Rajitha |   (  Updated:2026-02-25 11:56:28  IST  )

ప్రస్తుతం యువత సెలెబ్రిటీ కల్చర్ మాయలో పడుతోంది. ఓ టర్కీ స్టార్ పక్కన పావుగంట కూర్చోడానికి ఓ యువతి ఏకంగా రూ.30 కోట్లు చెల్లించింది.

సెలెబ్రిటీ కల్చర్ పై మోజు.. 15 నిముషాలకు రూ.30 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ కల్చర్ గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా మారిపోయింది. ఒకప్పుడు నటులు, క్రీడాకారులు లేదా ఆర్టిస్టులు ఎవరైనా తమ ప్రతిభ ద్వారా మాత్రమే గుర్తింపు పొందేవారు. అయితే ప్రస్తుతం డిజిటల్ యుగంలో సెలబ్రిటీ అనే భావన పూర్తిగా కొత్త రూపం దాల్చింది. సోషల్ మీడియా విస్తరణతో వ్యక్తిగత ఇమేజ్, ప్రజాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ కలిపి ఒక భారీ ఆర్థిక వ్యవస్థగా మారాయి. సినిమా, టెలివిజన్, క్రీడలు, ఫ్యాషన్, సోషల్ మీడియా.. ఇలా ఏ రంగమైనా సరే, ప్రజల దృష్టిని ఆకర్షించే వ్యక్తులు ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదుగుతున్నారు. ఒక సెలబ్రిటీ హాజరు, ఒక సోషల్ మీడియా పోస్ట్ లేదా కొన్ని నిమిషాల ఈవెంట్ పార్టిసిపేషన్ కూడా కోట్ల రూపాయల వ్యాపార విలువను సృష్టించే స్థాయికి చేరుకుంది.

పావుగంటకు రూ.30 కోట్లు

తాజాగా టర్కీకి చెందిన ప్రముఖ నటుడు బురాక్ ఓజ్చివిట్‌ ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కేవలం 15 నిమిషాల పాటు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు సుమారు 3.7 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లకు పైగా పారితోషికం పొందాడు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏమిటంటే ఓ రిచ్ అరబ్ మహిళ బురాక్ కు వీరాభిమాని. అయితే తనతో 15 నిముషాలు పక్కన కూర్చోడానికి ఓజ్చివిట్‌కు రూ.30 కోట్లు చెల్లించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో టర్కిష్ టెలివిజన్ సీరియల్స్‌కు ఉన్న అపారమైన ఆదరణ, ముఖ్యంగా బురాక్ ఓజ్చివిట్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ స్థాయి రెమ్యూనరేషన్‌కు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తుండగా.. మరోవైపు ఈ ఘటన సెలబ్రిటీ కల్చర్, గ్లోబల్ ఎంటర్టైన్‌మెంట్ మార్కెట్ విస్తరణ, స్టార్ పవర్ ఆర్థిక విలువపై కొత్త చర్చకు దారితీసింది. ఒక నటుడు కొద్ది నిమిషాల హాజరుకే కోట్ల రూపాయలు అందుకోవడం సాధారణ ప్రజలకు షాక్ ఇవ్వడమే కాకుండా, వినోద రంగంలో బ్రాండ్ ఇమేజ్ ఎంత పెద్ద వ్యాపారంగా మారిందో చూపిస్తోంది. అయితే ఇది మనదేశంలో కూడా ఊపందుకోవడం విచారకరం. ప్రస్తుతం మన దగ్గర అన్ని వుడ్స్ మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ తోసహా చిన్నా చితకా యూట్యుబ్ స్టార్స్ కూడా ఈవెంట్లలో, మాల్స్ ఓపెనింగ్స్ లో భారీ మొత్తం వసూలు చేస్తూ హంగామా చేస్తున్నారు.

అభిమానుల భావోద్వేగమే పెట్టుబడి

అయితే ఇప్పటి సెలబ్రిటీ కల్చర్ లో ప్రతిభతో పాటు పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ అత్యంత కీలకంగా మారింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, కొరియన్ పాప్ స్టార్‌ల నుంచి యూరోపియన్ స్పోర్ట్స్ ఐకాన్‌ల వరకు అభిమానుల భావోద్వేగమే మార్కెట్ విలువను నిర్ణయిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సెలబ్రిటీలను కేవలం వినోద రంగానికి పరిమితం చేయకుండా, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, రాజకీయ అభిప్రాయాలు, సామాజిక ప్రచారాల వరకు విస్తరించాయి. అభిమానులు ఇప్పుడు సినిమాలు, మ్యాచ్‌లకే కాదు, వారి వ్యక్తిగత జీవనశైలి, దుస్తులు, ప్రయాణాలు, అభిప్రాయాలను కూడా ఫాలో అవుతున్నారు. దీంతో సెలబ్రిటీలు ప్రభావవంతమైన మార్కెటింగ్ సాధనాలుగా మారిపోయారు.

సామజిక సమస్యలపై స్పందన కరువు

అయితే ఈ సెలబ్రిటీ కల్చర్‌పై విమర్శలు కూడా భారీగానే వస్తున్నాయి. సొసైటీలో సామాజిక అసమానతలు పెరుగుతున్న సమయంలో కొద్ది నిమిషాల హాజరుకే కోట్ల రూపాయలు చెల్లించబడటం సమాజ విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రజల దృష్టి నిజమైన సామాజిక సమస్యల నుంచి ఎంటర్టైన్మెంట్ సంస్కృతివైపు మళ్లుతోందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతోంది. ఒక స్టార్ ఇంట్లో లేదా వారి జీవితంలో రోజువారీ జరిగే ఏ చిన్న విషయం అయినా లేదా వారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినా హడావిడి చేసే యూత్.. సొసైటీలో జరిగే పెద్ద విషయాలు, సామాజిక సమస్యలపై నోరెత్తక పోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ, గ్లోబలైజేషన్, డిజిటల్ మీడియా ప్రభావంతో సెలబ్రిటీలు ఆధునిక సమాజంలో ప్రభావిత శక్తులుగా కొనసాగుతూనే ఉన్నారు. నేటి ప్రపంచంలో సెలబ్రిటీ కల్చర్ కేవలం వినోదానికి సంబంధించిన అంశం కాకుండా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ధోరణులు, ప్రజల అభిరుచులను ప్రభావితం చేసే శక్తివంతమైన గ్లోబల్ ఫెనామెనాన్‌గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story