ఇల్లెందులోని ఓ మార్ట్‌లో ఉపాధ్యాయుడి చేతివాటం.. సీసీటీవీ విజువల్స్ వైరల్!

by Jakkula.Mamatha |

విద్యార్థులకు విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ బోధించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడే దొంగతనానికి పాల్పడిన ఘటన ఇల్లెందు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ఇల్లెందులోని ఓ మార్ట్‌లో ఉపాధ్యాయుడి చేతివాటం.. సీసీటీవీ విజువల్స్ వైరల్!
X

దిశ, ఇల్లెందు: విద్యార్థులకు విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ బోధించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడే దొంగతనానికి పాల్పడిన ఘటన ఇల్లెందు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న ఓ మార్ట్‌లో మద్యం మత్తులో వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పలు వస్తువులను బిల్లు చెల్లించకుండా తన జేబులో వేసుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మార్ట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అతని చర్యలు స్పష్టంగా రికార్డ్ కావడంతో సిబ్బంది అతడిని నిలదీశారు. దీంతో విషయం బయటపడింది. మొదట తన తప్పును ఒప్పుకోకుండా వ్యవహరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సీసీ ఫుటేజ్ చూపించడంతో చివరకు రాజీకి వచ్చినట్లు తెలిసింది.

ఈ ఘటనలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిత్వం వహించి, మార్ట్ యాజమాన్యంతో మాట్లాడి రాజీ కుదిర్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో విషయం పోలీసుల వరకు వెళ్లకుండా అక్కడికక్కడే ముగిసిందని సమాచారం. ఈ ఘటనపై ఇల్లెందు పట్టణంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story