తెలంగాణలో కోవిడ్ మరణాలపై వాస్తవాలు బయటపెట్టండి: జనసేన

by Prasad Jukanti |   (  Updated:2026-07-23 09:53:45  IST  )

పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే తెలంగాణల ఆరోగ్యశాఖ మొద్దునిద్ర వీడటం లేదని తెలంగాణ జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది .

తెలంగాణలో కోవిడ్ మరణాలపై వాస్తవాలు బయటపెట్టండి: జనసేన
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విచారకరం అని తెలంగాణ జనసేన నాయకుడు, మాజీ డీహెచ్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నా వైద్యారోగ్య శాఖ నిద్రమత్తులో ఉండటం విచారకరమన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు ఇంకా వ్యాప్తిలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వారం రోజుల్లోనే కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

హెల్త్ బులిటిన్లు ఏవి?

కరోనా ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు దేశమంతటా వ్యాప్తిలో ఉన్నాయని, తెలంగాణలోనూ కోవిడ్ కేసులు, రెండు మరణాలు నమోదైనట్లు ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం అధికారిక హెల్త్ బులెటిన్లు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసి ప్రజలకు వాస్తవ పరిస్థితులను పారదర్శకంగా తెలియజేయాలని అన్నారు. తెలంగాణలో కోవిడ్‌పై అప్రమత్తత కనిపించడం లేదని, రాష్ట్రంలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన మేర కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు వచ్చే వారికి తగినన్ని కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, హెల్త్ వర్కర్లను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.

రాజకీయ విమర్శల కోసం కాదు.. నిర్మాణాత్మక సూచనలకే!

కోవిడ్‌తో పాటు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, నీటి ద్వారా వ్యాపించే ఇతర అంటువ్యాధులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నాయని తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్, దోమల నివారణ చర్యలు, ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 638 పీహెచ్‌సీలు, 3432 సబ్ సెంటర్లు ఉన్నాయని, పట్టణాల్లో 161 మున్సిపాలిటీలు, 1489 వార్డులు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నా ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేలు, కోవిడ్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ ఎందుకు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక మందుల కొరత తీవ్రంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తక్షణ సమీక్ష నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆయన కోరారు. మందుల కొరత తలెత్తకుండా అత్యవసర నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యం రాజకీయాలకు అతీతమైన అంశం అని ప్రభుత్వం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల ఆరోగ్య పరిరక్షణే నా ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.

Next Story