జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. 27న ‘ఛలో పార్లమెంట్’

by Ratna Kumari |

ఈ నెల 27న ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. 27న ‘ఛలో పార్లమెంట్’
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యల సాధన కోసం ఈ నెల 27న ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు తెలిపారు. గురువారం కరీంనగర్‌లోని ఫెడరేషన్ కార్యాలయంలో ‘ఛలో పార్లమెంట్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణ, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు చట్టబద్ధత వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు రైలు ప్రయాణాల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ దాదాపు 15 ఏళ్లపాటు అమల్లో ఉన్న రైల్వే రాయితీని కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పటివరకు పునరుద్ధరించకపోవడంతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే ఆ సదుపాయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో మీడియా రంగం విస్తరించిన నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో ‘నేషనల్ మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో రిటైర్డ్, సీనియర్ జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అక్రమ కేసులను అరికట్టేందుకు పార్లమెంట్‌లో ‘జర్నలిస్టుల రక్షణ చట్టం’ తీసుకురావాలని, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత్రికేయ సంఘాలు, జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి, దేశవ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 27న జరిగే ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమంలో జిల్లా నుంచి జర్నలిస్టులు, టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు, రాష్ట్ర నాయకులతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. ధర్నా అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు లక్కం సురేష్, కొమ్ము గణేష్, జిల్లా సహాయ కార్యదర్శులు అతికం రాజశేఖర్, గుండి కిరణ్, నాయకులు దీక్షిత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story