- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూపాలపల్లిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై సీసీఎస్ దాడులు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై సీసీఎస్ పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.1,96,430 విలువైన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై సీసీఎస్ పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.1,96,430 విలువైన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు జిల్లా కేంద్రంలోని చాముండా జనరల్ స్టోర్స్, దుర్గా జనరల్ స్టోర్స్, పవన్ కృష్ణ కిరాణం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అంబర్, ఆర్‌ఆర్, అనార్, జేకే, మీరాజ్ తదితర నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించి మొత్తం రూ.1,96,430 విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో చాముండా జనరల్ స్టోర్ నిర్వాహకుడు ఛత్రారం సతీష్‌ను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి హానికరమైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ చేయడం, విక్రయించడం, రవాణా చేయడం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






