- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి మహిళ దుర్మరణం.. పదేళ్ల క్రితం భర్త కూడా అచ్చం అలాగే!
బస్టాండ్‌లో డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి 32 ఏళ్ల మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బస్టాండ్‌లో డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి 32 ఏళ్ల మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఆమె భర్త కూడా అచ్చం ఇలాగే రెండు వాహనాల మధ్య చిక్కుకుని మరణించడం ఈ ఘటనలో అత్యంత విషాదకరం. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఖేతుయ్ గ్రామానికి చెందిన నేహా సింగ్ (32) ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం కంపెనీ మీటింగ్ కోసం ఉన్నావ్‌లోని బాంగర్‌మౌ వెళ్లేందుకు హర్దోయ్ బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు ఎక్కే క్రమంలో నడుచుకుంటూ వెళుతుండగా.. హర్దోయ్, కన్నౌజ్ డిపోలకు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు అజాగ్రత్తగా ఒకేసారి బస్సులను ముందుకు తీశారు. దీంతో రెండు బస్సుల ముందు భాగాల మధ్య ఇరుక్కుపోయిన నేహా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
విధి ఆడిన వింత నాటకం..
పదేళ్ల క్రితం ట్రక్ డ్రైవర్‌గా పనిచేసిన ఆమె భర్త సర్వేశ్ సింగ్ కూడా ఓ డీసీఎం, ట్రక్ మధ్య ఇరుక్కుపోయి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. భర్త మరణం తర్వాత నేహానే ఉద్యోగం చేస్తూ 15 ఏళ్ల కూతురు, 11 ఏళ్ల కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఇప్పుడు తల్లి కూడా అదే తరహా ప్రమాదంలో మరణించడంతో ఆ పిల్లలిద్దరూ దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని మృతురాలి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






