- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యూనిఫామ్ వెనుక ఉన్నది మనిషే.. నొప్పి మాకూ ఉంటుంది’.. ఢిల్లీ పోలీసుల భావోద్వేగ పోస్ట్!
నీట్ పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసనలు హింసాత్మకంగా మారడంపై ఢిల్లీ పోలీసులు తీవ్రస్థాయిలో స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్ వద్ద సిజేపీ (CJP) చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసనలు హింసాత్మకంగా మారడంపై ఢిల్లీ పోలీసులు తీవ్రస్థాయిలో స్పందించారు. విధులు నిర్వర్తిస్తున్న తమ సిబ్బందిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, కానీ హింసకు ఎక్కడా తావులేదని స్పష్టం చేశారు. ‘యూనిఫామ్ ధరించినంత మాత్రాన ఒక మనిషికి నొప్పి తెలియదని కాదు. ప్రతి ఖాకీ బ్యాడ్జ్ వెనుక స్పందించే హృదయం, ఒక కుటుంబం, దేశానికి సేవ చేస్తామన్న ప్రమాణం ఉంటాయి. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడులు చేయడం తీవ్రంగా కలచివేస్తోంది. అభిప్రాయ భేదాలు ఉంటే గళం వినిపించొచ్చు.. కానీ హింసకు మాత్రం ఏమాత్రం చోటు ఉండకూడదు.’ ఢిల్లీ పోలీస్ అధికారిక ట్వీట్‌లో పేర్కొంది.
118 మంది పోలీసులకు గాయాలు!
ఈ నిరసనల సందర్భంగా అల్లరి మూకలు రాళ్లదాడికి దిగడంతోపాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేశాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రాళ్లదాడిలో ఏసీపీ జైప్రకాష్ (నుదుటికి గాయం), ఏసీపీ వివేక్ భగత్ (తలకు, భుజానికి తీవ్ర గాయాలు)లతో పాటు దాదాపు 118 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారని, వారిలో కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. నిరసనకారుల ముసుగులో అల్లరి మూకలు వచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని పేర్కొంటూ.. ఈ ఘటనపై న్యూఢిల్లీ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో 10 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. విద్యార్థులు పోలీసులపై దాడులకు దిగిన వీడియోలను, గాయపడిన అధికారుల దృశ్యాలను ఈ పోస్ట్‌కు జత చేశారు.
నిరసనల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికీ, చట్టబద్ధంగా శాంతిభద్రతలను పరిరక్షించడమే తమ ప్రాధాన్యమని ఢిల్లీ పోలీస్ స్పష్టం చేసింది. అయితే ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల పట్ల సానుభూతి కల్పించేందుకే ఈ వీడియో విడుదల చేశారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండగా, నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ మరికొందరు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.






