- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా?.. ఆగస్టు 28 నుంచి క్రెడాయ్ భారీ ప్రాపర్టీ షో
హైదరాబాద్‌లో మరోసారి ప్రాపర్టీ షోను క్రెడాయ్ ఏర్పాటు చేస్తుంది. వచ్చే నెల 28 నుంచి 30వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 1, 3లో ఏర్పాటు చేయనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మరోసారి ప్రాపర్టీ షోను క్రెడాయ్ ఏర్పాటు చేస్తుంది. వచ్చే నెల 28 నుంచి 30వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 1, 3లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాపర్టీ షో థీమ్‌ని ‘రేట్ ఆగదు.. డిమాండ్ తగ్గదు’ అని నిర్ణయించారు. ఇక్కడ కొనుగోలుదారులకు విశ్వాసం ఎక్కువ. నిరంతర డిమాండ్, స్థిరమైన ధరల పెరుగుదల ఉంటుంది. అందుకే రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతు లభిస్తుందని క్రెడాయ్ ప్రకటించింది. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడానికి, పెర్మినెంట్ రెసిడెన్సీగా మార్చుకోవడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడికి ఇక్కడ భరోసా దొరుకుతుందని, అందుకే మార్కెట్ వాస్తవాలను క్రెడాయ్ ప్రకటిస్తుందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026 కార్యక్రమం విశేషాలను గురువారం ప్రతినిధులు విడదల చేశారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఆస్తి ధరలు తగ్గుతాయని ఆశిస్తూ కొనుగోలుదారులు వేచి చూడటం మనం తరచుగా చూస్తుంటామని, కానీ హైదరాబాద్ వాస్తవం ఏమిటంటే మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. నాణ్యమైన స్థలాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందన్నారు. 'రేట్ ఆగదు - డిమాండ్ తగ్గదు' అనే నినాదం నగరంలోని ఆర్థిక వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఇక్కడ ఆస్తి విలువలు నగరం యొక్క అద్భుతమైన అభివృద్ధితో నేరుగా ముడిపడి ఉంది. ఈ ఆగస్టులో అత్యుత్తమ రెరా ఆమోదిత ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా కుటుంబాలు వేచి చూడటం మానేసి పెట్టుబడి పెట్టేలా వారికి విశ్వాసం కల్పించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఏడాదిలో ఎంత మార్పు..
ఒక కుటుంబం తమ జీవిత కాలంలో చేసే అతిపెద్ద పెట్టుబడులలో ఇల్లు కొనడం ఒకటని, అందుకే పారదర్శకత, విశ్వసనీయతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని క్రెడాయ్ హైదరాబాద్ నాయకుడు బి.జగన్నాథ రావు అన్నారు. నేటి మార్కెట్‌లో ధరల పోకడల కారణంగా ప్రజలు సరైన సమయం గురించి పునరాలోచిస్తున్నట్లు మనం చూస్తున్నామన్నారు. కొన్ని సంవత్సరాలుగా గచ్చిబౌలి మార్కెట్‌లో చదరపు అడుగు ధర రూ.5000 – రూ.10000 నుంచి పెరిగింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే ధరలు చదరపు అడుగుకు రూ.600 – రూ.750 పరిధిలో పెరిగాయన్నారు. ప్రధాన ప్రాంతాలలో ఆస్తుల ధరలు పెరుగుతూనే ఉంటాయని, డిమాండ్ కూడా పెరుగుతుందన్నారు. ఇల్లు కొనడానికి ఎంత ఎక్కువ కాలం వేచి ఉంటే, అది అంత ఖరీదైనదిగా మారుతుందన్నారు. అందుకే ఇప్పుడే కొనాలని మేము కోరడం లేదని, ఈ ప్రాపర్టీ షోతో లక్ష్యం నగరంలో 100% ధృవీకరించబడిన రెరా ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌లను అందించడమే తమ లక్ష్యమన్నారు.
అన్నీ ఒకేచోట..
చాలా మంది కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అతిపెద్ద అడ్డంకిగా ఉంటుది. ప్రాపర్టీ షోలో ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులు బ్యాంకు అధికారులతో నేరుగా మాట్లాడొచ్చు. అక్కడికక్కడే తమ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయించుకోవచ్చు. వడ్డీ రేట్లు, గృహ రుణ నిర్మాణాలను పరిశీలించవచ్చు. ప్రదర్శనలో హైదరాబాద్ వ్యాప్తంగా అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాటెడ్ డెవలప్‌మెంట్లు, ఆఫీస్ స్పేస్‌లతో సహా విస్తృత శ్రేణిలో నివాసం, వాణిజ్య ఆఫర్లు ప్రదర్శించబడతాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు, విధాన రూపకర్తలు, పరిశ్రమ భాగస్వాములను ఒకచోట చేర్చే ఒక ప్రీమియం కేంద్రీకృత రియల్ ఎస్టేట్ వేదికగా ఉంటుంది. ప్రాపర్టీ షో ఇల్లు వెతికే క్రమంలో ఉండే ఒత్తిడిని తగ్గించేలా రూపొందిస్తున్నారు. నగరమంతటా చెల్లాచెదురుగా ఉన్న ప్రదేశాలకు వారాంతాల్లో డ్రైవింగ్ చేస్తూ గడపడానికి బదులుగా, రెరా ఆమోదం పొందిన వేలాది ప్రాజెక్టుల గురించి ఒకే చోట తెలుసుకునే వీలవుతుంది. ప్రాపర్టీ షో కన్వీనర్ బి.జైపాల్ రెడ్డి, కో-కన్వీనర్ శ్రీ బి.వినోద్ రెడ్డి, వారి బృందం ప్రాపర్టీ షోను ఎంతో పకడ్బందీగా ప్రణాళిక చేస్తున్నారు. ఇండ్లు కొనాలని అనుకునే వారికి వందకి పైగా రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులను పరిశీలించవచ్చు. డెవలపర్లతో నేరుగా మాట్లాడవచ్చు. అగ్రశ్రేణి బ్యాంకుల నుంచి తక్షణ రుణాలపై స్పష్టత పొందొచ్చు. కొనుగోలుదారుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాస్తవిక దృక్పథాన్ని అందించడానికి, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నాయకులు, రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థలతో నిర్వహించే ప్రత్యేక చర్చలు కూడా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ సంయుక్త కార్యదర్శి శ్రీరాం ముసునూరు, కోశాధికారి నితీష్ రెడ్డి గూడూరు, ఉపాధ్యక్షుడు కే అనిల్ రెడ్డి, అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కుర్ర శ్రీనాథ్, సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ బన్సల్, ప్రాపర్టీ షో సహ కన్వీనర్ బి.వినోద్ రెడ్డి పాల్గొన్నారు.






