ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ మీటింగ్.. కీలక అంశాలపై సమీక్ష

by Malleboina Mahesh |

పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ సమీక్ష! దేశంలో 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు. నిత్యావసరాల కొరత రాకుండా కేంద్రం అప్రమత్తం.

ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ మీటింగ్.. కీలక అంశాలపై సమీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. సాధారణ ప్రజలకు అవసరమైన ఆహారం, ఇంధన, విద్యుత్, ఎరువులు వంటి కీలక అవసరాల లభ్యతపై సమగ్రంగా పరిశీలించారు. దేశంలో ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు వివిధ దేశాల నుంచి సరఫరా మార్గాలను విస్తరించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

దేశంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని, వ్యూహాత్మక నిల్వలతో కలిపి ఇది 74 రోజులకు చేరుతుందని అధికారులు తెలిపారు. గ్యాస్ ధరలను నియంత్రణలో ఉంచడం, బ్లాక్ మార్కెటింగ్, నిల్వ దాచివేతలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. విద్యుత్ అవసరాల కోసం తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, వేసవి కాలంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ప్రత్యేక సడలింపులు, థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంపు వంటి చర్యలను సమీక్షించారు.

వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు

ప్రజలకు అవసరమైన కీలక వనరుల లభ్యతను ప్రధాని సమీక్షించారు. వ్యవసాయం, ఎరువులు, షిప్పింగ్, విమానయానం, లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈ రంగాల్లో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సంక్షోభ ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఖచ్చితమైన సమాచారం సమయానికి అందేలా చూడాలని సూచించారు. యుద్ధం ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు, రంగాలకు సహాయపడేందుకు సంబంధిత శాఖలు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు.

Next Story