ఓయూ క్యాంపస్‌లో నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు

by Malleboina Mahesh |

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినుల పట్ల అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. కన్నతల్లిని రాత్రి వేళ హాస్టల్‌లోకి అనుమతించకపోవడమే కాకుండా, ఆ చర్యను ప్రశ్నించిన విద్యార్థినులపై కేసులు నమోదు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఓయూ క్యాంపస్‌లో నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఓయూ క్యాంపస్‌లో తన తల్లికి అవమానం జరిగిందని నిరసన తెలిపిన విద్యార్థులకు యూనివర్సిటీ పోలీసులు షాక్ ఇచ్చారు. హాస్టల్ యాజమాన్యం విద్యార్థిని తల్లిని అవమానించారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు కేసులు పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో సదరు విద్యార్థులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు, హాస్టల్ సిబ్బంది తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..

ఈ నెల 11న రాత్రి తన బిడ్డను చూడటానికి దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక విద్యార్థిని తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా, మానవత్వం లేకుండా బయటకు పంపే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పనులు ముగించుకుని చీకటి పడే సమయానికి వచ్చిన సదరు తల్లిని అవమానించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థినులు రాత్రి సమయం అని కూడా చూడకుండా రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. "సొంత బిడ్డల వద్దకు వచ్చే తల్లిదండ్రులకే గౌరవం లేని చోట మేం ఎలా చదువుకోవాలి?" అని నిలదీస్తూ డైరెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆమెనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన రాత్రి నుంచి 12న తేదీ ఉదయం వరకు కొనసాగింది. ఈ క్రమంలో విద్యార్థుల ఆందోళనకు న్యాయమైన పరిష్కారం చూడాల్సింది పోయి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. తల్లిదండ్రులు వచ్చినప్పుడు కనీసం ఒక అకామిడేషన్ ఏర్పాటు చేయాలన్న కనీస విజ్ఞప్తిని కూడా తిరస్కరించడం పై విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి.

Next Story