శేరిలింగంపల్లి మండల విద్యాశాఖలో వింత పరిస్థితి

by Kodari Anjali |

శేరిలింగంపల్లి మండలం విద్యాశాఖ అధికారి పనితీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

శేరిలింగంపల్లి మండల విద్యాశాఖలో వింత పరిస్థితి
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం విద్యాశాఖ అధికారి పనితీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వందలాది కాలనీలుగా విస్తరించిన హైటెక్ సిటీలో అడుగడుగునా ప్లే స్కూల్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందుబాటులో లేదు. 44 ప్రభుత్వ ప్రాథమిక,13 ప్రాథమికోన్నత,13 ఉన్నత పాఠశాలలో సుమారు1లక్షల 62 వేల మంది విద్యార్థులు ఉండగా.. ప్రైవేట్ పాఠశాలల్లో ఆ సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది.330 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నట్లు చెబుతున్న 500 వరకు పాఠశాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అందులో ఉన్న విద్యార్థుల సంఖ్య, అనుమతి లేనివి ఎన్ని ఉన్నాయో విద్యాశాఖ కార్యాలయంలో అందుబాటులో లేవు. 13 ప్లే స్కూల్ వరకు అనుమతులు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి.

తనిఖీలు నిల్ వసూళ్లు ఫుల్..

ప్రైవేట్ పాఠశాలలు తనిఖీ చేసి ప్రతి ఏట నివేదికలు డి ఈ ఓ కి పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎంఈఓ తో పాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు తనిఖీలలో పాలుపంచుకోవాలి. జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఎనిమిది మంది సీఆర్పీలు పనిచేయాల్సి ఉండగా అందులో నాలుగు పోస్టులు మంజూరు అయ్యాయి. ఆ నలుగురిలో ఇద్దరు 100 కిలోమీటర్ల దూరం నుంచి విధులకు హాజరవుతున్నారు. ఒక సిఆర్పి సెలవులు ఉండగా మరో వ్యక్తి విధులకు హాజరు కావడం లేదు. మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన అనుమతుల రెన్యువల్, కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలకు అనుమతులు అక్కడ వసతులు, విద్యార్థుల వివరాలు ప్రతి ఏటా జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక రూపంలో సమర్పించాలి. ఇందులో అక్రమంగా ఏర్పాటుచేసిన పాఠశాలలు గుర్తించి అనుమతులు తీసుకోవాలని నోటీసులు జారీ చేయడం,అక్కడ నెలకొన్న పాఠశాల పరిస్థితులు అంచనా వేసి విద్యార్థుల భద్రత ఇతర అంశాలు పరిశీలించి నోటీసులు జారీ చేయాలి. ఆ విషయాన్ని డీఈవోకి నివేదికల రూపంలో తెలియజేయాలి. ఈ మండలంలో అలాంటి పరిస్థితులు ఏమి జరగడం లేదనీ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతా అక్రమమే.. సరి చేసే దారేది

ప్రైవేట్ స్కూల్లో ఒకే సెక్షన్ కు అనుమతులు తీసుకొని రెండు మూడు సెక్షన్లు విభజించి నడిపిస్తున్నారు. ఎక్కడో ఒకచోట అనుమతి తీసుకుని దాని ఆధారంగా 7,8 చోట్ల నడిపించేస్తున్నారు. క్రీడ మైదానం లేకపోయినా ట్రాఫిక్, ఫైర్ సర్వీస్, పొల్యూషన్ అనుమతులు లేకుండానే చందానగర్, గౌలిదోడి , మాదాపూర్ లో అనేక ప్రైవేట్ పాఠశాల నడుస్తున్నాయి. ప్రైమరీ పాఠశాలలు గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ లో ఉంటే ఏదైనా ప్రమాదం జరిగితే చిన్నారులు తప్పించుకోవడానికి సులువుగా ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేని హైరైజడ్ భవనాలలో ఈ పాఠశాలలు ఎక్కువగా నడుస్తున్నాయి.కనీస వసతులు లేవు.. ఆటస్థలం ఉందా? పార్కింగ్ ఏరియా ఎంత? అక్కడ పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయా ఇవేవీ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ కిడ్స్ స్కూల్ అనుమతి మంజూరు చేయడంలో ఎంఈఓ పాత్ర అత్యంత కీలకం.. ఎంఈఓ ఇచ్చే నివేదిక ఆధారంగానే డీఈవో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నట్లు ఎంఈఓ ధ్రువీకరణ అవసరం. ఇక్కడే మండల విద్యాశాఖ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పాఠశాల పర్మిషన్లు, సెక్షన్ల పెంపుపై ఎంఈఓ నివేదిక అత్యంత కీలకం. పిసిబి, ఫైర్ సర్వీస్, ట్రాఫిక్ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇవేవీ లేకుండానే వందలాది పాఠశాలల నిర్వహణ వెనుక భారీ అవినీతి జరుగుతుంది. ఎంఈఓ నివేదికపై క్రాస్ చెక్ చేసుకోవలసిన డీఈఓ కార్యాలయం అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.

తప్పుడు నివేదికలు అక్రమ వసూళ్లు

కార్పొరేట్ పాఠశాలలు మినహా కాలనీలలో ఏర్పాటుచేసే కిడ్స్ పాఠశాలలుపై తప్పుడు నివేలదికలిచ్చి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాల యజమానులు సరైన వసతి లేకపోయినా అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ రసీదుతోనే ఏళ్ళుగా కాలం వెలదీస్తున్నారు.అనుమతి లెనిన్పాఠశాలలు గుర్తించి నోటీసులు జారీ చేయాల్సిన ఎంఈఓ రాజకీయ నాయకులు ,పాఠశాల యజమానుల నుంచి ఒత్తిడి ఉందంటూ తప్పించుకుంటున్నారు. క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారా? ఉంటే టీచర్లకు సరైన వేతనాలు చెల్లిస్తున్నారా చూసే నాధుడే కరువయ్యాడు.

తనిఖీలకు వెళ్తే ఒత్తిడి తెస్తున్నారు: ఎంఈఓ శంకరయ్య

పని ఒత్తిడి, సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు చేయడం లేవు. అనుమతుల కోసం 50 పాఠశాలలో దరఖాస్తు చేయగా రిజెక్ట్ చేసాం. ఈ ఏడాది 15 పాఠశాలలే తనిఖీ చేశాం. తనిఖీలకు వెళ్తే ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారు. చాలా పాఠశాలలు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. బహుళ అంతస్తులు భవనాలలో పాఠశాలలు కొనసాగుతున్నాయి. అనువతలేని పాఠశాలలు, డీఈఓకు ఇచ్చే నివేదికలు, తనిఖీలు అంశంపై ఎంఈఓ నుంచి స్పష్టత కరువైంది.

Next Story