క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు రేపు శ్రీకారం: మంత్రి పొంగులేటి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకూ ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని.. ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు రేపు శ్రీకారం: మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకూ ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని.. ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చివరి లబ్ధిదారుని వరకు గౌరవప్రదమైన సొంతింటిని నిర్మించి అందిస్తామని చెప్పారు. పేదల సొంతింటి కలలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని తెలిపారు. సొంత నివాసం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.

గత నెల ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను కూడా నిజం చేయబోతున్నదని మంత్రి చెప్పారు. క్యూర్ పరిధిలో లక్ష ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు సెక్రెటేరియట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్‌తో కలిసి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. గతేడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

Next Story