వైకాపా నేత నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు

by Malleboina Mahesh |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై పంచాయతీ నిధుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత నాగార్జున యాదవ్‌పై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

వైకాపా నేత నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ నాగార్జున యాదవ్‌ (Nagarjuna Yadav)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను పవన్ కల్యాణ్ దారి మళ్లించారని నాగార్జున యాదవ్ ఇటీవల ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

ఈ వ్యవహారంపై జనసేన నాయకుడు రామ సైదులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందేందుకు నాగార్జున యాదవ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామసైదులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జనసేన నేతలు హెచ్చరించారు.

Next Story