రూ.10 లక్షలు పెట్టి 'నీట్' పేపర్ కొన్నా ఫెయిల్.. 720 మార్కులకు వచ్చింది 107

by Malleboina Mahesh |

నీట్ పేపర్ లీక్ కేసులో ఆసక్తికర ట్విస్ట్. రూ.10 లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొన్నా.. ఆ విద్యార్థికి 720 మార్కులకు కేవలం 107 మార్కులే వచ్చాయి.

రూ.10 లక్షలు పెట్టి నీట్ పేపర్ కొన్నా ఫెయిల్.. 720 మార్కులకు వచ్చింది 107
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) క్వశ్చన్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. విచారణకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వారిని కనిపెట్టి.. అరెస్టు చేస్తున్నారు. ఈ విచారణలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, వారిలో దినేశ్ బివాల్ ఒకరు. ఇతను తన కుమారుడైన రిషి బివాల్‌కు ఎలాగైనా మెడికల్ సీటు రావాలనే ఆశతో.. పరీక్షకు ముందే ఏకంగా రూ. 10 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి లీకైన నీట్ క్వశ్చన్ పేపర్‌ను కొనుగోలు చేశాడు.

అయితే, పరీక్షకు ముందే లీకైన ప్రశ్నపత్రం చేతికి వచ్చినప్పటికీ ఆ విద్యార్థి పరీక్షలో ఘోరంగా విఫలమయ్యాడు. నీట్ పరీక్షలో మొత్తం 720 మార్కులకు గాను రిషికి కేవలం 107 మార్కులు మాత్రమే వచ్చాయి. చదువులో అత్యంత వెనుకబడిన రిషి.. గతంలో పదో తరగతి (10th) లో కేవలం 44 శాతం మార్కులు, ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో అతికష్టం మీద పాసైనట్లు సీబీఐ రికార్డుల ద్వారా తెలిసింది. ప్రశ్నపత్రం ముందే దొరికినా, కనీస మార్కులు కూడా సాధించలేక ఈ విద్యార్థి ఫెయిల్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, తండ్రి దినేశ్ బివాల్ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉండగా.. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న విద్యార్థి రిషి మాత్రం ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వార్తపై స్పందిస్తున్న నెటిజన్లు ఇలాంటి విద్యార్థులు రేపు డాక్టర్లు అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Next Story