27న 'ఛలో పార్లమెంట్'కు పిలుపు

by Ratna Kumari |

ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న 'ఛలో పార్లమెంట్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు పిలుపునిచ్చారు.

27న ఛలో పార్లమెంట్కు పిలుపు
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న 'ఛలో పార్లమెంట్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు 'ఛలో పార్లమెంట్' పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జర్నలిస్టుల దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

కోవిడ్ సమయంలో నిలిపివేసిన 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీ పాస్‌లను పునరుద్ధరించాలని, జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం వర్తింపజేయాలని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు పూర్తి చట్టబద్ధత కల్పించాలని, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.

టీడబ్ల్యూజేఎఫ్ పోరాటానికి బీసీ జేఏసీ మద్దతు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల డిమాండ్లు న్యాయమైనవేనని, టీడబ్ల్యూజేఎఫ్ చేపడుతున్న 'ఛలో పార్లమెంట్' ఉద్యమానికి బీసీ జేఏసీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు సౌడమల్ల యోహాన్, నాయకులు రాఘవుల శ్రీనివాసు, రాజేంద్రప్రసాద్, ఇప్పకాయల సాగర్, శంకర్, శ్రీనివాస్, రవీందర్, కొండ గణేష్, వెంకన్న, కొలిపాక క్రాంతికుమార్, మామునూరి ప్రవీణ్‌కుమార్, సంగం సత్యనారాయణ, సంగం శ్రీనివాస్, సొల్లు శంకర్, కొక్కుల రవీందర్, పిట్ట శ్రీనివాస్, గొల్లపల్లి రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story