తెలంగాణ చరిత్రలో తొలిసారి

by Gantepaka Srikanth |

సమ్మక్క-సారలక్క మేడారం జాతర మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది.

తెలంగాణ చరిత్రలో తొలిసారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమ్మక్క-సారలక్క మేడారం జాతర మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. తెలంగాణ చరిత్రలో తొలి సారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 18న ములుగు జిల్లా మేడారంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. దీంతో మంత్రివర్గం, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి తరలిరానున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతు భరోసాపై కూడా స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.

ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క

మేడారంలో మంత్రివర్గ సమావేశం ఖరారు కావడంతో మంత్రి సీతక్క ఏర్పాట్లను స్వయంగా చూడనున్నారు. మంగళవారం మేడారం వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 19న ముగిసే వరకు అక్కడే ఉండనున్నట్లుగా తెలిసింది. వసతి ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు, రెండు రోజులు, ఒక రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

16 నుంచి సీఎం జిల్లాల పర్యటనలు

సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈనెల 16 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 16న ఆదిలాబాద్, నిర్మల్, 17న మహబూగనగర్, 18న ఖమ్మం, మేడారంలో సీఎం పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 19న మేడారం జాతర పునర్ నిర్మాణ పనులను ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్ కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story