- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి ఒడిలో పరవశం.. అనంతగిరి–కోట్‌పల్లి టూరిస్టుల హాట్‌స్పాట్
పచ్చటి ప్రకృతి రమణీయతతో, వనమూలికల సుగంధ వాసనలు వెదజల్లుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్న అనంతగిరి కొండల్లో వీకెండ్ వచ్చిందంటే పర్యాటకులు ఎంజాయ్ చేస్తూ ప్రకృతిలో పరవశించిపోతారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి : పచ్చటి ప్రకృతి రమణీయతతో, వనమూలికల సుగంధ వాసనలు వెదజల్లుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్న అనంతగిరి కొండల్లో వీకెండ్ వచ్చిందంటే పర్యాటకులు ఎంజాయ్ చేస్తూ ప్రకృతిలో పరవశించిపోతారు. అనంతగిరి కొండలకు సమీపంలో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్‌పల్లి మధ్యతరహా ప్రాజెక్టులో బోటింగ్ చేసి చిన్నా, పెద్దా తేడా లేకుండా సరదాగా గడుపుతుంటారు. వికారాబాద్ జిల్లాలో టూరిజం హబ్‌గా వెలుగొందుతున్న అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టులో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి, సమీపంలోని రిసార్ట్లలో ఆనందోత్సాహాలతో గడుపుతుంటారు.
ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనం అనంతగిరి కొండలు..
వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో కొలువుదీరిన అనంత పద్మనాభస్వామిని దర్శించుకుని, పచ్చటి ప్రకృతిలో నెమళ్ల నాట్యాలు, కోకిలల కుహూకారాలు, వనమూలికల సుగంధ వాసనల మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా గుట్టలపై సంచరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. వీకెండ్ వచ్చిందంటే భారీ సంఖ్యలో పర్యాటకులు కొండల చుట్టూ తిరుగుతూ ప్రకృతిని తిలకిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులు, గజిబిజి ప్రాంతాల్లో కూర్చొని తినుబండారాలు ఆస్వాదిస్తూ తమ కష్టాలను మరిచి, ఆలోచనలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. వారానికి ఒక్కసారైనా వీకెండ్‌లో అనంతగిరికి వస్తే ప్రశాంత వాతావరణంలో రిలాక్స్ అయి సంతోషంగా తిరిగి వెళ్తారు.
జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు కోట్‌పల్లి..
అనంతగిరి కొండల్లో ఎంజాయ్ చేసిన పర్యాటకులు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుకుని అక్కడి జలకళను ఆస్వాదిస్తారు. ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ సరదాగా గడిపి, అక్కడ ఏర్పాటు చేసిన చిన్నచిన్న దుకాణాల్లో తినుబండారాలు కొనుగోలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పర్యాటకుల రాకతో అక్కడి చిరు వ్యాపారులకు కూడా జీవనోపాధి లభిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అనంతగిరి కొండల పరిసరాల్లోని రిసార్ట్లకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, యువత భారీ సంఖ్యలో వచ్చి వివిధ ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ రిసార్ట్లతో అనంతగిరి కొండల పరిసర ప్రాంతాల్లో నూతన సంస్కృతి ఏర్పడుతోందని పలువురు పేర్కొంటున్నారు.






