- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో అకాడి సందడి
ఆధునిక జీవనశైలి ఎంత వేగంగా మారుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టడం లేదు.

దిశ, ఉట్నూర్ : ఆధునిక జీవనశైలి ఎంత వేగంగా మారుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను యథాతథంగా పాటిస్తూ, వాటిని భావితరాలకు అందించేందుకు కట్టుబడి ఉన్నారు. ఆషాఢ మాసంలో జరిగే అకాడి పూజలతో ఆదివాసీల పండుగల పరంపర ప్రారంభమై దీపావళి వరకు కొనసాగుతుంది. దీంతో నాలుగు నెలల పాటు గిరిజన గూడాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి.
ప్రతి ఆదివాసీ గూడలో కొనసాగుతున్న ఆచారం..
ఏ పండుగైనా ప్రకృతితో మమేకమై జరుపుకోవడం ఆదివాసీల ప్రత్యేకత. పుడమితల్లిని, వనదేవతలను ఆరాధిస్తూ, ప్రకృతి ప్రసాదించే జీవనాధారాల పట్ల తమ కృతజ్ఞతను చాటుకుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో అకాడి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆధ్యాత్మిక సంప్రదాయం..
ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే విత్తనాలు నాటిన అనంతరం ఆదివాసీలు వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పంటలు సమృద్ధిగా పండాలని, పశువులు వ్యాధులు, వన్యమృగాల బారిన పడకుండా ఉండాలని, అడవికి వెళ్లే ప్రజలకు ఎలాంటి అపాయం కలగకుండా చూడాలని ప్రార్థిస్తూ వనదేవతలను వేడుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నేటికీ అదే భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, జైనూర్, కెరమెరి, తిర్యాణి, లింగాపూర్, సిర్పూర్ (యు) తదితర మండలాల్లోని గిరిజన గూడాల్లో అకాడి పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
రాజుల్ పేన్కు ప్రత్యేక పూజలు..
గ్రామ సమీపంలోని అడవిలో ఉన్న ఇప్పచెట్టు వద్ద వనదేవతగా భావించే రాజుల్ పేన్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో పురుషులు మాత్రమే పాల్గొనడం ప్రత్యేకత. అనంతరం అడవిలో ఒక గీత గీసి, ఆ గీతను పశువులతో దాటిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా తమ పాడి పశువులను వనదేవత కాపాడుతుందనే విశ్వాసం ఆదివాసీల్లో బలంగా ఉంది.
సహపంక్తి భోజనాలతో ముగింపు..
పూజలు పూర్తయిన అనంతరం అదే ప్రదేశంలో సామూహికంగా వంటలు చేసి సహపంక్తి భోజనాలు నిర్వహిస్తారు. గ్రామస్థులంతా కలిసి భోజనం చేయడం ద్వారా ఐక్యత, సోదరభావాన్ని చాటుకుంటారు. అనంతరం వనదేవత ఆశీస్సులతో తమ తమ గూడాలకు తిరిగి వెళ్తారు.
ప్రకృతితో మమేకమైన జీవనతత్వం..
అకాడి పూజలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసీ జీవన తత్వానికి ప్రతీక. మారుతున్న కాలంలోనూ తమ మూలాలను మరువకుండా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, భావితరాలకు అందిస్తున్న ఆదివాసీల జీవన విధానం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.






