18న ఎల్‌బీనగర్‌లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ‌

by Ratna Kumari |

ఈ నెల 18న ఎల్‌బీనగర్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.

18న ఎల్‌బీనగర్‌లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ‌
X

దిశ, చైతన్యపురి: ఈ నెల 18న ఎల్‌బీనగర్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లలో భాగంగా బుధవారం సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలు, వారికి ఇచ్చిన హామీల అమలు కోసం ఈ యువ సంగ్రామ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేసి, యువత గొంతుకను ప్రభుత్వానికి బలంగా వినిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story