సీఎం వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఆగ్రహం

by Batti.Sumithra |

కనగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు నాయకులు.

సీఎం వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఆగ్రహం
X

దిశ, కనగల్ : నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం కనగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఎస్‌కే కరీం పాషాతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను గుర్తుచేస్తూ, కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేసే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు.

అలాగే, ముఖ్యమంత్రి సభలకు ముందు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. రూ.13,000 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) ద్వారా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక జీవోలు లేదా మంజూరు ఉత్తర్వులు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినవేనని, వాటిని నల్లగొండకు ప్రత్యేకంగా వచ్చినట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా ప్రతిపక్షాలపై విమర్శలు మానుకుని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వంగాల సహదేవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్, కడారి కృష్ణయ్య, సైదులు గౌడ్, వెంకట్ రెడ్డి, ఎర్రమాద వెంకట్ రెడ్డి, బుర్రి శ్రీమన్ కుమార్, యాదయ్య, కిషన్ పాల్గొన్నారు.

Next Story