- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్–మోమిన్‌పేట్ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకుల బైఠాయింపు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ప్రధాన రహదారులు గుంతలమయంగా తయారయ్యాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

దిశ, శంకర్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ప్రధాన రహదారులు గుంతలమయంగా తయారయ్యాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శంకర్‌పల్లి నుంచి వికారాబాద్–మోమిన్‌పేట్ వెళ్లే రహదారిపై లక్ష్మారెడ్డిగూడ గేటు వద్ద ఆదివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా, బైఠాయింపు, రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు నుంచి మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డౌన్ డౌన్.. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్ధన్ రెడ్డి, మాల చిన్న నరసింహులు మాట్లాడుతూ శంకర్‌పల్లి నుంచి మోమిన్‌పేట్, మర్పల్లి, బంటారం, పంచలింగాల, నవాబ్‌పేట్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారంతా ఈ రహదారిపైనే ప్రయాణించాల్సి వస్తోందన్నారు. శంకర్‌పల్లి నుంచి మైతాఫ్‌ఖాన్‌గూడెం వరకు రోడ్డు గుంతలమయమై ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.
రాత్రిపూట ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రధాన రహదారులను కూడా మరమ్మతు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రతినిత్యం ఈ రహదారి గుండా దేవరంపల్లి, చీమలదరి, కోనాపూర్, వెంకటాల, మోమిన్‌పేట్, వికారాబాద్, నవాబ్‌పేట్, మరపల్లి, బంటారం, సిరిపురం, పంచలింగాల తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు తాము పండించిన కూరగాయలను శంకర్‌పల్లి, పటాన్‌చెరు, గుడిమల్కాపూర్ మార్కెట్లకు తరలించాలన్నా ఈ గుంతలమయమైన రహదారి పై ఆటోలు, ఇతర వాహనాలు నడపడం కష్టంగా మారిందని ఆరోపించారు. ప్రతిరోజూ ఈ రహదారిపై అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లో రోగులను తరలించడానికీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు నిద్రమత్తు వీడడం లేదని విమర్శించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిధిలోకి వచ్చే ఈ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మండల, మున్సిపల్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాణిక్ రెడ్డి, మహాలింగాపురం సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, భుజంగ రెడ్డి, గండ్రు మాణిక్య రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, నారాయణ, మాజీ ఎంపీటీసీ యాదగిరి, నాయకులు కొంగల మల్లేశం, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అశోక్ గౌడ్, దండు నర్సింలు, విట్టల్ రెడ్డి, రామశేఖర్ రెడ్డి, అనంత రెడ్డి, బోడ వెంకటయ్య, కుమార్, కరుణాకర్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకటయ్య, బుచ్చిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు పై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను సముదాయించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు 'సీఎం డౌన్ డౌన్.. ఎమ్మెల్యే డౌన్ డౌన్.. ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.






