నదీ జలాలపై చర్చ అంటేనే బీఆర్ఎస్ నేతలు పారిపోయారు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by Malleboina Mahesh |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

నదీ జలాలపై చర్చ అంటేనే బీఆర్ఎస్ నేతలు పారిపోయారు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అటెన్షన్ డైవర్షన్ డ్రామాలంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. అలాగే కృష్ణా నదీ జలాల వాటా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను పక్క దోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో అసెంబ్లీలో నదీ జలాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైనప్పుడు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకులు సభ నుంచి పారిపోయారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులకు, దోచుకున్న సొమ్ముకు తాము ఇప్పుడు వడ్డీలు కట్టాల్సి వస్తోందని, ప్రజల ప్రయోజనాల కంటే బీఆర్ఎన్ నాయకులు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అడ్లూరి ధ్వజమెత్తారు.

ఈ పరిణామాలతో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం కాబోతోందని మంత్రి లక్ష్మణ్ జోస్యం చెప్పారు. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని, అదే పతనం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం కావడం ఖాయమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. బీఆర్ఎస్ పదేళ్ల అస్తవ్యస్త పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి భంగపాటు తప్పదని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో నిజమైన అభివృద్ధి జరుగుతోందని, పారదర్శకమైన పాలన అందిస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Next Story