ఇకనుంచి వదలం.. చీల్చి చెండాడుతాం: BRS

by Gantepaka Srikanth |

కక్ష సాధింపులో భాగంగనే మాజీమంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.

ఇకనుంచి వదలం.. చీల్చి చెండాడుతాం: BRS
X

దిశ, తెలంగాణ బ్యూరో: కక్ష సాధింపులో భాగంగనే మాజీమంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎగురుతూ వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్‌ల ప్రభుత్వమని.. కాంగ్రెస్ అంటే స్కామ్‌ల ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఇక చీల్చి చెండాడుతుందనే ఈ కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారని.. కాంగ్రెస్ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్‌రెడ్డి అవినీతిపై హరీశ్‌రావు ప్రశ్నిస్తూనే ఉంటారని అన్నారు.

రెండేళ్లుగా కుంభకోణాల్లోనే మంత్రులు: మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్ట్ అవినీతిని బయటపెట్టినందుకే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రెండేళ్లగా మంత్రులు అనేక కుంభకోణాలకు పాలపడుతున్నారని.. వాటిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నామని చెప్పారు. శాసనసభ వేదికగా, ప్రజాక్షేత్రంలో బయట పెడుతున్నామనే తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఒకసారి కాళేశ్వరం అని, ఒకసారి ఈ-కార్ రేస్ అని, మరోసారి విద్యుత్ కేసు అని విచారణ పేరుతో పిలుస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై నిలదీస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని.. ఆ బ్యాచ్‌కు నాయకుడు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. సివిల్ సప్లయ్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. సమ్మక్క-సారక్క టెండర్ల విషయంలో మంత్రులు మధ్య కొట్లాట జరిగిందని.. పారిశ్రామిక భూములను రేవంత్‌రెడ్డి బంధువులకు అప్పగిస్తున్నారని.. హ్యామ్ రోడ్ల పేరుతో కుంభకోణం జరగబోతున్నదని ఆరోపించారు. రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు గనుల కాంట్రాక్ట్ విషయంలోనే సీఎం, మంత్రులకు మధ్య గొడవ మొదలయ్యాయన్నారు. రోజుకొక కుంభకోణాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు.

బొగ్గు స్కామ్‌పై పార్లమెంట్‌లో మాట్లాడతా: రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బొగ్గు స్కామ్‌పై విచారణ జరపాలని పార్లమెంట్‌లో మాట్లాడుతానని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ప్రజలు చూస్తున్నారన్నారు. సీరియల్ మాదిరి రోజుకో కేసు పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. హరీశ్‌రావు బొగ్గు స్కామ్ బయటపెడితే నోటీసులు ఇచ్చారని.. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు అనేక సార్లు జైలుకు వెళ్లారని.. ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టలేరని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును వేధిస్తే తెలంగాణ సమాజం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించామని.. మున్సిపల్ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందన్నారు.

ప్రభుత్వం కుట్రలను ప్రజలు చూస్తున్నరు: టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రానంద్

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలంగాణ రాష్ట్రమంత చూస్తున్నదని టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రానంద్ అన్నారు. కేసులకే భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని.. కేసులు తమకు కొత్తకాదని చెప్పారు. ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారని.. విచారణల పేరుతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టడం లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెట్టినందుకే కుట్ర పూరితంగా హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమలవుతున్నదని.. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రజానీకం అన్నీ గమనిస్తూనే ఉన్నదని అన్నారు. హరీశ్‌రావు బొగ్గు కుంభకోణం బయటపెట్టారనే దురుద్దేశంతోనే నోటీసులు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులు ఏ విధంగా దోచుకుంటున్నారో హరీశ్‌రావు చెప్పారని అన్నారు. ఆయన అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతున్నదన్నారు. అక్రమ కేసులకు తాము భయపడేది లేదన్నారు. ప్రజల దృష్టిమలచడం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని.. రెండేళ్లగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు టెండర్ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ప్రజాపాలన పేరుతో కేసులు: మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నదని.. ప్రజాపాలన పేరుతో కేసులు పెడుతున్నారని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. నైని బొగ్గు టెండర్‌తోపాటు రేవంత్‌రెడ్డి బావమరిది టెండర్ రద్దు చేయాలని హరీశ్‌రావు మాట్లాడినందుకు ప్రభుత్వం సమాధాన చెప్పకుండా రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చారని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. బొగ్గు కుంభకోణం బయట పెట్టాలని.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నదని అన్నారు. రేవంత్‌రెడ్డి అవినీతి బయటపెడుతూనే ఉంటామని చెప్పారు.

రేవంత్ బంధువులకు బొగ్గు టెండర్లు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి బంధువులకు బొగ్గు టెండర్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. నైనీ బ్లాక్ టెండర్ రద్దు చేస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మిగిలిన టెండర్లు ఎందుకు రద్దు చేయరని హరీశ్‌రావు ప్రశ్నించారని.. అందుకే ఆయనపై కక్ష కట్టారని అన్నారు. సాక్షిగా మాత్రమే విచారణకు రమ్మని నోటీసుల్లో పేర్కొన్నారని.. గంటల తరబడి విచారణ చేయడం సరికాదని అన్నారు. హరీశ్‌రావు వెంట లాయర్లను అనుమతించలేదని.. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. యావత్ తెలంగాణ సమాజం హరీశ్‌రావు వెంట ఉన్నదని స్పష్టం చేశారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నదని.. కిషన్‌రెడ్డి ఎందుకు కళ్లు మూసుకొని ఉన్నారని ప్రశ్నించారు. సింగరేణిని లూటీ చేస్తున్న దండుపాళ్యం ముఠాపై సిట్ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story