కట్టింది బారెడు... తీసుకున్నది మూరెడు !

by Batti.Sumithra |

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలుస్తోంది.

కట్టింది బారెడు... తీసుకున్నది మూరెడు !
X

దిశ, కామారెడ్డి : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తూ, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించాల్సిన ఐకేపీ అధికారులు గ్రామాలకు వచ్చినా, కేవలం చావిడి లేదా గ్రామపంచాయతీ కార్యాలయం వద్దే కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సభ్యులకు సరైన అవగాహన లేక దీర్ఘకాలిక రుణభారం పెరుగుతోందని మహిళలు వాపోతున్నారు.

ప్రతి ఏడాది మార్చి నెలలో లక్ష్యాల సాధన పేరుతో హడావుడి చేసే ఐకేపీ, బ్యాంకు అధికారులు ఆ తర్వాత సంఘాల పరిస్థితిని పట్టించుకోకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల కంటే చెల్లించే వడ్డీ, జరిమానాలే అధికంగా మారుతున్నాయని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు సీసీలు, వీవోఏలు మహిళా సంఘాల పేర్లు, స్త్రీనిధి రుణాలను దుర్వినియోగం చేస్తూ సభ్యులకు తెలియకుండా నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీసీలు, వీవోఏల ఇష్టారాజ్యం..

జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని ఓ గ్రామంలో ఒక మహిళా సంఘ సభ్యురాలు స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ, సంబంధిత వీవోఏ ఆ మొత్తాన్ని తన అవసరాలకు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేను మొత్తం రుణం చెల్లించాను అని సభ్యురాలు చెప్పగా, ఎప్పుడు చెల్లించావు.. రసీదు ఉందా అని అధికారులు ప్రశ్నించగా, వీవోఏకు డబ్బులు ఇచ్చాను. తర్వాత రసీదు ఇస్తానన్నాడు అని ఆమె సమాధానం ఇవ్వడంతో అధికారులు ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం.

మరో మహిళా సంఘ సభ్యురాలు గ్రూపు రుణం తీసుకోకపోయినా, ప్రతి నెలా పొదుపు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే గ్రూపులోని మిగతా సభ్యులు రుణం చెల్లించకపోవడంతో ఆమె వ్యక్తిగత బ్యాంకు ఖాతాను హోల్డ్‌లో పెట్టడమే కాకుండా, నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు కూడా ఖాతా నుంచి మినహాయిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సభ్యురాలు బ్యాంకు అధికారులను సంప్రదించగా, మీరు ఉన్న గ్రూపు రుణ బకాయిల కారణంగానే ఈ చర్యలు తీసుకున్నాం అని వారు వివరించినట్లు సమాచారం. తాను రుణం తీసుకోలేదని, కేవలం పొదుపు మాత్రమే చేస్తున్నానని ఆమె తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది బ్యాంకు స్టేట్‌మెంట్ పరిశీలించగా నెలనెలా డబ్బులు మినహాయించినట్లు కనిపించగా, గత ఐదేళ్లుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించింది. ఇక గ్రామాల్లో నచ్చిన సభ్యులను ఎంపిక చేసి, రుణాలు సక్రమంగా చెల్లించని గ్రూపుల నుంచి తొలగించి కొత్త గ్రూపుల్లో చేర్చుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

పాత గ్రూపు రుణాలను పూర్తిగా చెల్లింపజేసి, కొత్త గ్రూపుల ద్వారా మళ్లీ రుణాలు పొందుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ గ్రామంలో ఇద్దరు సభ్యులను ఒక గ్రూపు నుంచి తొలగించి మరో గ్రూపులో చేర్చిన ఘటన చోటుచేసుకుంది. పాత గ్రూపులోని మొత్తం రుణం చెల్లించే సమయంలో బ్యాంకు అధికారులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఓ బ్యాంకు అధికారి సంబంధిత ఏపీఎం, సీసీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని ముందుగా ఎందుకు తెలియజేయలేదు. రేపు ఏవైనా సమస్యలు వస్తే బాధ్యత ఎవరిది అంటూ నిలదీశారు. సాయంత్రంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే సంబంధిత సీసీ ఇకపై ఇలా జరగదు సార్ అంటూ విషయం దాటవేసినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ వ్యవహారం బ్యాంకు ఉన్నతాధికారులు, డీఆర్డీఏ అధికారుల దృష్టికి రాకపోవడం శోచనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు వచ్చిన ధాన్యం అమ్మకాల డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లిన రైతులకు కూడా మహిళా సంఘాల రుణాల సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. మహిళా సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఖాతాలను హోల్డ్‌లో పెట్టామని బ్యాంకు అధికారులు చెబుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కార్పొరేషన్ ఉద్యోగిని జీతం ఖాతా కామారెడ్డి శాఖలో ఉండగా, ఆమె మహిళా సంఘం రుణం నాగిరెడ్డిపేట శాఖలో ఉండడంతో ఖాతాను హోల్డ్‌లో పెట్టి జీతం నుంచి కూడా డబ్బులు మినహాయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులను ప్రశ్నించగా, "గ్రూపు సభ్యులు రుణాలు చెల్లించడం లేదు" అని సమాధానం ఇచ్చారని ఆమె తెలిపారు. తాను తన వాటా మొత్తం చెల్లించి గ్రూపు నుంచి తప్పుకుంటానని కోరినా అధికారులు అంగీకరించలేదని వాపోయారు. దీంతో ప్రతి నెలా జీతం నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు, ఐకేపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని తెలిపారు. ఇతర గ్రూపుల్లో సభ్యుల పూర్తి రుణాలను చెల్లించి వారిని కొత్త గ్రూపుల్లో చేర్చినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పని అధికారులు, తన విషయంలో మాత్రం ఎందుకు అనుమతించడం లేదని ఆమె ప్రశ్నించారు. గ్రామాల్లో మహిళా సంఘాల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపడితే తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Next Story