దర్జాగా బఫర్ జోన్ ఆక్రమణ.. పొంచి ఉన్న వరద ముంపు

by Batti.Sumithra |   (  Updated:2026-06-15 16:07:46  IST  )

మిర్యాలగూడ పట్టణంలో ఆక్రమణదారుల ఆగడాలు ఆగడం లేదు.

దర్జాగా బఫర్ జోన్ ఆక్రమణ.. పొంచి ఉన్న వరద ముంపు
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో ఆక్రమణదారుల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములనే లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్ వంటి ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బఫర్ జోన్ ఆక్రమణ..

మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్ పరిధిలో సర్వే నంబర్ 519లో చిన్న చెరువు ఉంది. ఈ చెరువు షాబునగర్, తాళ్లగడ్డ ప్రాంతాలకు విస్తరించి ఉంది. చెరువు చుట్టూ సుమారు 30 మీటర్ల మేర బఫర్ జోన్గా గుర్తించారు. అయితే, ఈ బఫర్ జోన్‌ను కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించి కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా షాబునగర్‌లోని స్మశానవాటిక ఎదురుగా ఉన్న బఫర్ జోన్‌లో అక్రమంగా ప్రహరీ గోడలు నిర్మించారని వారు పేర్కొంటున్నారు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రభుత్వం నిర్మించిన కాల్వలను కూడా ఆక్రమించి గోడలు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 100 అడుగుల వెడల్పు ఉండాల్సిన రోడ్డును రియల్టర్లు 80 అడుగులకే పరిమితం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఆక్రమించిన బఫర్ జోన్‌ను ప్లాట్లుగా విభజించి, స్మశానవాటిక కనిపించకుండా ప్రహరీ గోడలు నిర్మించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పొంచి ఉన్న వరద ముంపు..

చిన్నపాటి వర్షాలకే పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉంటోంది. వర్షాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాళ్లగడ్డ, షాబునగర్, రాంనగర్ ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్డుల్లో నాళాలను ఆక్రమించడంతో అవి ఇరుకుగా మారి, వరద నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. 2024లో నాళాలపై జరిగిన అక్రమ నిర్మాణాల కారణంగా భారీ వరదలు వచ్చి అనేక ఇళ్లు నీట మునిగిన ఘటనలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

సర్వే నంబర్ 519లో చెరువు శిఖం భూములు, బఫర్ జోన్, నాళాల ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక శాఖ మరో శాఖ పై బాధ్యత నెట్టేస్తూ కాలయాపన చేస్తోందని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకవర్గాలు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆక్రమణదారుల్లో కొందరు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసే సాహసం కూడా అధికారులు చేయడం లేదని ప్రజలు అంటున్నారు.

పలుమార్లు రెవెన్యూ అధికారులకు లేఖలు ఇచ్చాం :ఇరిగేషన్ ఏఈ మానస

చెరువు ఆక్రమణల పై ఫిర్యాదులు రావడంతో చెరువుకు సంబంధించిన భూమి విస్తీర్ణ వివరాలు, మ్యాప్ అందించాలని కొన్ని నెలల క్రితమే రెవెన్యూ అధికారులకు లేఖ ద్వారా కోరాం. అయితే ఇప్పటివరకు చెరువు మ్యాప్ అందలేదు. దీంతో చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. సర్వేయర్‌ను పంపించి చెరువు హద్దులు నిర్ధారిస్తే, ఆక్రమణదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని ఇరిగేషన్ ఏఈ మానస తెలిపారు.

Next Story