- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడేళ్లుగా అసంపూర్తిగా బాక్స్ నాలా పనులు
ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు చేపట్టిన బాక్స్ టైప్ నాలా నిర్మాణం ఏడేళ్లుగా పూర్తి కాకపోవడంతో చంపాపేట్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, చంపాపేట్ : ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు చేపట్టిన బాక్స్ టైప్ నాలా నిర్మాణం ఏడేళ్లుగా పూర్తి కాకపోవడంతో చంపాపేట్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతి నగర్, దుర్గ భవాని నగర్, ఎస్జీఆర్ కాలనీ, రెడ్డి కాలనీ, రాజిరెడ్డి కాలనీలలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసి 2018 మే నెలలో పనులు ప్రారంభించినప్పటికీ, నేటికీ పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
స్థానికుల కథనం ప్రకారం ఇప్పటివరకు కేవలం కొంత భాగం మాత్రమే పూర్తికాగా, కీలకమైన ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా చంపాపేట్ ప్రధాన రహదారి పై డీమార్ట్ ముందు నుంచి రెడ్డి కాలనీకి వెళ్లే మార్గంలో బాక్స్ నాలా నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో వర్షాకాలంలో భారీగా నీరు నిలిచిపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో వర్షపు నీరు, విద్యుత్ ప్రమాదాల కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అలాగే పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పనులను వేగవంతం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చంపాపేట్ ప్రధాన రహదారి నుంచి ఐఎస్ సదన్ వైపు వర్షపు నీరు ప్రవహించే ఈ మార్గం అత్యంత కీలకమైనదని, ఇక్కడి పనులు పూర్తి కాకపోతే రాబోయే వర్షాకాలంలో మళ్లీ వరద ముప్పు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయలేని నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న బాక్స్ నాలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చంపాపేట్‌కు చెందిన సామాజిక ఉద్యమకారులు రాము, లక్ష్మణ్ మాట్లాడుతూ సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు, ఐఎస్ సదన్ డివిజన్ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రధాన రహదారిపై నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తే వేలాది మంది ప్రజలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. “వర్షాలు మొదలయ్యేలోపు బాక్స్ నాలా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి” అని వారు విజ్ఞప్తి చేశారు.






