బుక్‌మైషోకు భారీ జరిమానా

by Muthe.Rajitha |

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో లైవ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది.

బుక్‌మైషోకు భారీ జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో లైవ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. సినిమా ప్రదర్శన రద్దయిన విషయాన్ని వినియోగదారుడికి ముందే చెప్పకుండా ఇబ్బంది పెట్టినందుకు గాను రూ.10 వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.

అసలేం జరిగిందంటే?

కూకట్‌పల్లికి చెందిన నారాయణన్ కుట్టిగోపాల కృష్ణన్ అనే వ్యక్తి.. 2025 జనవరి 1న కొత్త సంవత్సరం రోజున సినిమా చూడాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం లులు మాల్‌లోని సినీపోలిస్ థియేటర్‌లో ఉదయం 10:50 గంటల షోకు ‘బారోజ్’ అనే సినిమా టికెట్‌ను బుక్ మై షో యాప్‌లో కొనుగోలు చేశారు. తీరా ఆయన ఉత్సాహంగా థియేటర్‌కు వెళ్లేసరికి, అక్కడ ఆ షో రద్దయి వేరే సినిమా నడుస్తోంది. కనీసం షో రద్దయినట్లు బుక్ మై షో గానీ, థియేటర్ యాజమాన్యం గానీ తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కొత్త సంవత్సరం రోజున తన సమయం వృథా చేసి మానసిక వేదనకు గురిచేశారని బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

బుక్ మై షో వాదన

ఈ కేసుపై బుక్ మై షో సంస్థ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. తాము కేవలం వినియోగదారుడికి, థియేటర్‌కు మధ్య ఒక ప్లాట్‌ఫామ్ గా మాత్రమే ఉంటామని తెలిపింది. షోలు నడపడం, టైమింగ్స్ మార్చడం, రద్దు చేయడం వంటివన్నీ థియేటర్ యాజమాన్యం చేతుల్లోనే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా, కస్టమర్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే టికెట్ ధర రూ.207.14 మొత్తాన్ని పూర్తిగా రీఫండ్ చేశామని కోర్టుకు వివరించింది.

కమిషన్ సంచలన తీర్పు

ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల కమిషన్ బుక్ మై షో వాదనను తోసిపుచ్చింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ షో రద్దయితే, ఆ సమాచారాన్ని కస్టమర్‌కు చేరవేయాల్సిన కనీస బాధ్యత బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ముందే సమాచారం ఇవ్వకుండా కస్టమర్‌ను థియేటర్ వరకు వచ్చేలా చేయడం ముమ్మాటికీ బుక్ మై షో వైపు ఉన్న సేవాలోపమేనని తప్పుపట్టింది. కేవలం డబ్బులు వెనక్కి ఇచ్చినంత మాత్రాన సరిపోదని, వినియోగదారుడి సమయాన్ని వృథా చేసి అతనికి కలిగించిన మానసిక వేదనకు బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంటూ కమిషన్ ఈ తీర్పును వెలువరించింది.

Next Story