- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్టుబడి సాయం సాకుతో రాయితీ విత్తనాలకు మంగళం
పెట్టుబడి సాయం సాకుతో రాయితీ విత్తనాలకు మంగళం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనా అందని రైతు భరోసా, రైతుల ఆవేదన!

దిశ, మోర్తాడ్ : గతంలో ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనాలను లీజులు, రాయితీలపై అందించేది. కానీ పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్న సాకుతో ప్రభుత్వం రాయితీ విత్తనాల పంపిణీని నిలిపివేసింది. దీంతో రైతులపై విత్తనాల కొనుగోలు భారం అదనంగా పడుతోంది. గతంలో ప్రతి వర్షాకాలం సీజన్‌లో మొక్కజొన్న, సోయా విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందించేది. గత ప్రభుత్వం నుంచి రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని చెబుతూ ఈ విత్తనాల సరఫరాను పూర్తిగా బంద్ పెట్టారు. సహకార సంఘాల ద్వారా రాయితీ విత్తనాల వ్యాపారం చేయడం వల్ల సంఘాలకు అటు ఆదాయం కలిసి వచ్చేది, ఇటు రైతులకు నాణ్యమైన విత్తనాలు దొరికేవి.
రాయితీ విత్తనాలతో ఎన్నో లాభాలు..
ప్రభుత్వం ద్వారా పంపిణీ సాగడం వల్ల సహకార సంఘాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేవి. 35 శాతం వరకు రాయితీ లభించడంతో రైతులు విత్తనాల కొనుగోలుకు తక్కువ ఖర్చు అయ్యేది. ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించి కంపెనీల విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొనుగోలు చేయించేది. దీనివల్ల విత్తనాలు మొలకెత్తకపోవడం అనేది జరిగేది కాదు, కల్తీ విత్తనాల కంపెనీలకు బ్రేక్ పడేది. అయితే, 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడం మొదలుపెట్టినప్పటి నుంచి రాయితీ విత్తనాల సరఫరాకు బ్రేక్ పడింది. పెట్టుబడి సాయం కూడా సీజన్ ఆరంభంలో కాకుండా తమకు వీలున్నప్పుడు అందించడం వల్ల ఆ సొమ్ము దేనికీ ఉపయోగపడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ అందని రైతు భరోసా..
ఈ ఖరీఫ్ సీజన్‌లో బాల్కొండ నియోజకవర్గంలో వరి 56.74వేల ఎకరాలు, మొక్కజొన్న 34.88వేల ఎకరాలు, సోయాబీన్ 96 ఎకరాలు, పసుపు 1,503 ఎకరాలలో సాగు చేయనున్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. వానాకాలం ప్రారంభమై రైతులు ముందస్తు సాగును సుమారుగా 30 శాతం పూర్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమకాలేదు. గతంలో పెట్టుబడి సహాయాన్ని సీజన్ ప్రారంభంలోనే అందిస్తే ఎరువులకు, విత్తనాలకు ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం రైతు భరోసా ఊసే లేకపోవడంతో సన్నకారు రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి రాయితీ విత్తనాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
రాయితీ విత్తనాలు అందిస్తే మేలు
ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయాన్ని సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల అనేకమంది వృధాగానే ఖర్చు చేస్తున్నారు. అలా కాకుండా రాయితీపై విత్తనాలు, ఇతర వ్యవసాయ పరికరాలను సొసైటీల ద్వారా అందిస్తే నిజమైన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయం చేసే వారికి నేరుగా ప్రయోజనం కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.:- చిన్న గోవింద్, రైతు, తోర్తి.
వ్యాపారుల వద్ద కొనాల్సి వస్తోంది
రాయితీపై రైతులకు ఎంతో మేలు రకమైన విత్తనాలు అందేవి. ఇప్పుడు రాయితీ ఎత్తివేయడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి సాయం ఇస్తున్నామనే నెపంతో రాయితీ విత్తనాలు ఆపడం సరైనది కాదు. బయట కొనే విత్తనాలు నకిలీవి అయి చాలా సందర్భాల్లో మొలకెత్తడం లేదు.:- బాస దేవానందం, రైతు, తోర్తి.






