- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2,500తో భూమి గెలుచుకోండి.. ఫాం ల్యాండ్ నయా దందా
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రియల్టర్లు కొంగొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో/ మాడ్గుల : జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రియల్టర్లు కొంగొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న వ్యాపారులు ఫాం ల్యాండ్ ను ‘లక్కీ డ్రా’ పేరుతో బురిడీ కొట్టించి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నయా దందాకు తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. ఫాం ల్యాండ్ దందా అనేదే చట్ట విరుద్ధం కాగా.. లక్కీ డ్రా పేరుతో స్కీం పెట్టి గుంటల లెక్కన బహుమతులు అంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు బరితెగించి మరీ బిజినెస్ చేస్తున్నారు. రియల్ వ్యాపారం ముసుగులో జరుగుతున్న ఈ నయా దందాపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది.
లక్కీ డ్రా పేరుతో దందా..
పాత బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 105లో 2.35 ఎకరాల ఇనాం భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం ఎస్సీలకు పంపిణీ చేయగా.. కొందరు ఓఆర్సీ తెచ్చుకొని గతంలో ఇతరులకు తక్కువ ధరకే అమ్ముకున్నారు. ఈ భూములకు నేడు విపరీతమైన డిమాండ్ రాగా.. ప్రస్తుతం ఇందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫాం ల్యాండ్ దందాను చేస్తున్నారు. ‘సిద్ధి వినాయక ఎంటర్ ప్రైజెస్’ పేరుతో నల్లగొండ జిల్లాకు చెందిన వ్యాపా రులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. స్కీం లో చేరే వారు రూ.2,500 చె ల్లించాలని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం 30 మందికి బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బమతి కింద 10 గుంటల భూమిని, ఆతర్వాత వరుసగా గెలుపొందిన 19 మంది సభ్యులకు రూ.5కు గుంటల చొప్పున భూమిని బహుమతిగా ఇస్తామని బ్రోచర్లలో ముద్రించారు. డ్రాలో గెలుపొందిన మిగిలిన పది మందికి తులం సిల్వర్ కాయిన్స్ఇవ్వనున్నట్లు పేర్కొంటున్నారు. అక్టోబర్ 2న లక్కీ డ్రా తీసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అద్భుతమైన అవకాశమని, ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేయకండి అంటూ.. ఆన్ లైన్ లోనూ తెగ ప్రచారం చేస్తున్నారు.
చవకే అని కొంటే కష్టాలే!..
వెంచర్ చేసి ప్లాట్ల క్రయ విక్రయాలు జరపాలంటే వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నాలా ఫీజుతోపాటు గ్రామ పంచాయతీకి 10 శాతం ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా డైరెక్ట్‌గా గుంటల లెక్కన అమ్మకాలు జరిపేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫాం ల్యాండ్ దందాను చేస్తున్నారు. ఇది చట్ట విరుద్దమని, భవిష్యత్తులో ఆయా ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతులు పొందే సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇనాం భూమిని ఓఆర్సీతో క్రయ విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆయా భూముల్లో ఎలాంటి వాణిజ్య పరమైన దందాలు చేయడానికి వీలు లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చవకకే భూమి వస్తోందని ఆశ పడితే మోసపోక తప్పదని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. రియల్ వ్యాపారం ముసుగులో లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలకు అధికారులు ఆదిలోనే చెక్ పెట్టడంతో ప్రజలు మోసపోరని అంటున్నారు.






