వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి : పరవాడ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి

by Naga Rani Yarlagadda |

అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి : పరవాడ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. వారికి సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకోవాలని, గాయపడినవారికి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి చెందారు. సౌత్ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం బాధాకరమని పవన్ పేర్కొన్నట్లు డిప్యూటీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించాలని సూచించారని ఆ ప్రకటన వెల్లడించింది. విశాఖపట్నం పరిసరాల్లో ఉన్న పారిశ్రామికవాడల్లో ఉన్న అన్ని సంస్థల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

హోంమంత్రి అనిత, మంత్రి సుభాష్, పల్లా శ్రీనివాసరావు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. కార్మికుల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యమన్న మంత్రులు.. కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. హోంమంత్రి అనిత.. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు.

Next Story