- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూలపల్లి లో వెలుగులోకి భూ అక్రమ దందా
దూలపల్లిలో కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ నకిలీ ఓఆర్సీతో భూ కబ్జా.. అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టరేట్‌లో బాధితుడి ఫిర్యాదు!

దిశ, మేడ్చల్ బ్యూరో: ఒకే గ్రామ రెవెన్యూ పరిధిలో పలు సర్వే నెంబర్లలో జరిగిన అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం దూలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో భూ అక్రమ దందా వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ 154 లో జరిగిన అక్రమ వ్యవహారాలపై స్థానికులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాజాగా సర్వే నెంబర్ 155 లో జరిగిన మరో భారీ భూ మోసం వెలుగు చూసింది. గతంలో ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడిన వారు, వారి వద్ద నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన వారు ప్రస్తుత అసలైన భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో బాధితులు మరోసారి కలెక్టరేట్ మెట్లు ఎక్కారు.
పట్టాదార్ పాస్ బుక్కులు జారీ
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం.. దూలపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 148, 155 లో గల భూమిని 1975లోనే ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 38-ఈ కింద దుర్గం నారాయణ, దుర్గం రాములుకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సర్వే నెంబర్ 155 పరిధిలోని 2 ఎకరాల భూమి ఉంది. దుర్గం రాములు మరణానంతరం ఆయన వారసుల నుంచి శంకర్ రెడ్డి, మరొకరు కలిసి 2007లో (డాక్యుమెంట్ నెంబర్ 12384/2007) ఎకరం భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత భాగస్వామి తన హక్కులను శంకర్ రెడ్డికి బదిలీ చేయడంతో (రిలింక్విష్‌మెంట్ డీడ్ నంబర్ 14272/2007) శంకర్ రెడ్డి ఈ ఎకరం భూమికి పూర్తి హక్కుదారుడయ్యారు. నాటి కుత్బుల్లాపూర్ తహశీల్దార్ శంకర్ రెడ్డి యాజమాన్య హక్కులను గుర్తిస్తూ 2013లో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేశారు.
ఫోర్జరీ పత్రాలతో ఇష్టారాజ్యం
ఈ భూమిపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు నకిలీ, ఫోర్జరీ పత్రాలను సృష్టించారు. మెడిమల యాదయ్య గౌడ్.. సర్వే నెంబర్ 154 కు సంబంధించిన పాత జీపీఏ (నెంబర్ 575/1984) ఆధారంగా, సర్వే నంబర్ 155 ను తప్పుగా చూపిస్తూ అక్రమంగా ఓఆర్సీ (ఓఆర్సీ నంబర్ జే/5378/1997) సంపాదించి, దీని ఆధారంగా భూమిని ‘న్యూ స్టీల్ సిటీ మర్చంట్స్ వెల్ఫేర్ సొసైటీ’కి విక్రయించారు అని, అయితే ఆ సొసైటీకి మోసం తెలిసి వచ్చిన రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నప్పటికీ, సదరు కేటుగాళ్లు అదే రద్దయిన ఓఆర్సీని వాడుకుంటూ శ్రవణ్ అగర్వాల్‌తో పాటు మరో ఆరుగురికి విక్రయించడం జరిగిందని, దీని ఆధారంగా తదుపరి కాలంలో అనేక అక్రమ లావాదేవీలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోర్టు తీర్పులున్నా బేఖాతరు!
ఈ అక్రమ ఓఆర్సీ వ్యవహారంపై గతంలోనే రెవెన్యూ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి, సదరు ఓఆర్సీ పూర్తిగా నకిలీదని తేల్చారు. ఈ మేరకు అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ 2008లోనే ఆ ఓఆర్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం ఈ వివాదంపై మేడ్చల్ సివిల్ కోర్టు (ఓఎస్ నంబర్ 04/2008), ఆ తర్వాత హైకోర్టులోనూ (సెకండ్ అప్పీల్ నెంబర్ 996, 997 ఆఫ్ 2016) శంకర్ రెడ్డికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. 2023లో దాఖలైన రివ్యూ పిటిషన్ కొట్టివేయబడింది. అయినప్పటికీ, హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే కోర్టు ఆదేశాలను, స్టేటస్ కోను ధిక్కరిస్తూ శ్రవణ్ అగర్వాల్, శనిత్ గుప్తా, మదన్‌లాల్ మిట్టల్, రమేశ్ కుమార్ అగర్వాల్, అంజు మంగళ్ కలిసి 2019లో డాక్యుమెంట్ నంబర్లు 3295, 3296 ద్వారా మరికొందరికి (కొంపల్లి మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ గాంగ్యోల వెంకటేశ్, గాంగ్యోల రాకేశ్, గాంగ్యోల శివకుమార్, అలుగుల యాదగిరి రెడ్డి తదితరులకు) అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ భూ అక్రమ దందా పై సమగ్ర విచారణ జరిపి, రద్దయిన ఓఆర్సీ ఆధారంగా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను (డాక్యుమెంట్ నెంబర్ 3295/2019, 3296/2019) రద్దు చేయాలని బాధితుడు శంకర్ రెడ్డి కలెక్టర్‌ను వేడుకున్నారు.
మాజీ సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్ హస్తం?
ప్రస్తుతం ఆ అక్రమ దస్తావేజుల ఆధారంగా సదరు వ్యక్తులు తన భూమిలోకి చొరబడటానికి ప్రయత్నిస్తూ, తీవ్రమైన మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దూలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బూరుగు బావి హనుమంతరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బూరుగు బావి సత్యనారాయణ ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. సర్వే నెంబర్ 155 తో పాటు 135, 139, 145, 154, 156 నుంచి 162 వరకు ఇటువంటి వివాదాలు సృష్టించి ఎంతోమందిని వేధిస్తున్నారని తెలిపారు.






